Home

»

Latest News

సమ్మర్ సీజన్‌లో టాలీవుడ్‌కు ఎదురుదెబ్బ.. ఎండలకు తోడైన ఐపీఎల్ ఫీవర్!

Apr 21, 2026

- టాలీవుడ్ బాక్సాఫీస్ @ సమ్మర్ 2026 

- స్టార్స్ లేక‌ వెలవెలబోతున్న థియేటర్లు 

- 'పెద్ది' వాయిదాతో మారిన లెక్కలు 

- హిట్ కోసం పరితపిస్తున్న ఎగ్జిబిటర్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు సమ్మర్ సీజన్ అంటే కేవలం ఎండలు మాత్రమే కాదు, కలెక్షన్ల వర్షం కురిపించే అసలైన పండుగ కాలం. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని నిర్మాతలు ఆశపడతారు. అయితే, 2026 వేసవి మాత్రం టాలీవుడ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఏప్రిల్ మూడో వారం గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కనీసం ఒక్కటంటే ఒక్క భారీ విజయం నమోదు కాలేదు. గత నెల రోజులుగా విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం చిత్ర వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌ను ప్రధానంగా రెండు అంశాలు దెబ్బతీస్తున్నాయి. ఒకటి భానుడి భగభగలు అయితే, రెండోది ఐపీఎల్ క్రికెట్ ఫీవర్. సాయంత్రం వేళల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల ధాటికి జనాలు థియేటర్ల కంటే టీవీలకే పరిమితమవుతున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఆడియన్స్ సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చాలా చోట్ల షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, అది కలెక్షన్లుగా మారకపోవడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఏడాది సమ్మర్ సందడి తగ్గిపోవడానికి ప్రధాన కారణం 'స్టార్ పవర్' లోపించడమేనని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా వాయిదా పడటం టాలీవుడ్ బాక్సాఫీస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సమ్మర్ బరిలో ఒక భారీ సినిమా ఉంటే వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. కానీ, 'పెద్ది' వెనక్కి తగ్గడంతో థియేటర్ల వద్ద ఆ సందడి కనిపించడం లేదు. అలాగే సినిమాలకు వస్తున్న క్రేజ్ కంటే 'ఓటీటీ రిలీజ్' భయం ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా అడ్డుకుంటోంది. "ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది కదా" అనే ధోరణి థియేట్రికల్ రన్‌ను దెబ్బతీస్తోంది.

అయితే, నిరాశలో ఉన్న సినీ అభిమానులకు, ఎగ్జిబిటర్లకు మే నెల ఒక ఆశాదీపంలా కనిపిస్తోంది. వచ్చే నెలలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టబోతున్నాయి. తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’, కమెడియన్ సత్య హీరోగా పరిచయమవుతున్న ‘జెట్లీ’, నిఖిల్ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’ వంటి చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’, ‘ఎపిక్’, ‘గోదారి గట్టుపైన’ వంటి సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డబ్బింగ్ సినిమాలైన ‘దృశ్యం 3’, ‘ది డెవిల్’ కూడా పోటీలో ఉన్నాయి.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మే నెలలో విడుదలయ్యే ఈ చిన్న, మధ్య తరహా చిత్రాలలో కనీసం రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తేనే టాలీవుడ్ మళ్ళీ ట్రాక్‌లోకి వస్తుంది. చిన్న సినిమాలైనా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది గత అనుభవాలు చెబుతున్నాయి. మే నెలాఖరు వరకు ఏదైనా ఒక సర్ ప్రైజ్ హిట్ పడితేనే సమ్మర్ సీజన్ సక్సెస్ ఫుల్‌గా ముగిసినట్లవుతుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com