
రోమాలు నిక్కబొడుచుకునే పాటలకి, చక్కిలి గింతపెట్టే పాటలకి, మండే ఎండల్ని సైతం మంచు బిందువులుగా మార్చే పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ ఎవరంటే సుద్దాల అశోక్ తేజ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ లోని 'కొమరం భీముడో', ఖుషిలోని 'గజ్జె గళ్ళు మన్నాదిరో', శివాజీ లోని 'సహానా శ్వాసే వీచెనో... సహారా పువ్వై పూచెనో' సాంగ్స్ జస్ట్ స్మాల్ ఎగ్జామ్ ఫుల్.
ఠాగూర్ లోని 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' సాంగ్ కి జాతీయ అవార్డు అందుకున్నసుద్దాలకి మరొక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయన సుదీర్ఘ సాహిత్య సేవలకు, ప్రజా చైతన్యానికి అందించిన అమూల్యమైన రాతలకు గుర్తింపుగా 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి "బుర్రా నర్సమ్మ-లింగా రెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం" సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం తెలంగాణ సాహితీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. పురస్కార ఎంపిక కమిటీ ఛైర్మన్ కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలోని ఫిల్మ్ భవన్ ప్రాంగణంలో వైభవంగా జరగనుంది. సివిల్ సప్లైస్ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై సుద్దాల అశోక్ తేజకు జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు. గతంలో 2025 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్దారెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేయడం విశేషం.

Also Read: సంక్రాంతి రేసులో విశ్వంభర: కాకా పరిస్థితి ఏంటి.. రిలీజ్ డేట్ వచ్చింది కదా!
కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, బండలింగాపూర్ వంటి గ్రామాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుద్దాల అశోక్ తేజ, ఆ తర్వాత సినీ రంగానికి వచ్చి తన అక్షర విన్యాసంతో తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటివరకు ఆయన 1250కి పైగా చిత్రాలకు 2200కి పైగా సినీ గీతాలు రాయడమే కాకుండా, 2500కి పైగా ప్రైవేటు, జానపద గేయాలను రచించి తెలుగు రసజ్ఞులను అలరించారు. శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తిల తర్వాత జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డుని అందుకున్న మూడవ తెలుగు గేయ రచయితగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 2017లో 'ఫిదా' చిత్రంలోని "వచ్చిందే" పాటకూ, 2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కోటి రూపాయిల నగదు పురస్కారం సహా అనేక అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి సన్మానాలను అందుకున్నారు. సుద్దాల హన్మంతు, జానకమ్మల కడుపున జన్మించి, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రక్తం నిండా నింపుకున్న అశోక్ తేజ, తన కలాన్ని నిరుపేదల చైతన్యానికి, ప్రకృతి ప్రేరణకు, బహుజన సంస్కృతికి అంకితం చేశారు. 'ఒసేయ్ రాములమ్మ', 'నిన్నే పెళ్లాడుతా' చిత్రాలతో మొదలైన ఆయన ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.
[Suddala Ashok Teja, Telangana Telugu Tejam Award, Karimnagar Event, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]






