సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడు ఫిక్స్.. రంగంలోకి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్.!
Nov 29, 2026 5:17PM

సోనియా గాంధీ జీవిత కథను వెండితెరపైకి తీసుకురావాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయత్నాలు మరో అడుగు ముందుకు వెళ్లాయి. ఈ సినిమాకు దర్శకుడిగా క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో సోనియా గాంధీ బయోపిక్‌పై ఆసక్తి మొదలైంది. అయితే సినిమా పట్టాలెక్కాలంటే ఇంకా సోనియా గాంధీ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
గతంలో ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. జగ్గారెడ్డితో పాటు గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ కలిసి దర్శకుడి ఎంపికను ప్రకటించారు. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి సినిమా నిర్మాణానికి అనుమతి తీసుకుంటామని జగ్గారెడ్డి తెలిపారు.
సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే ఆత్మకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, రాజీవ్ గాంధీతో ప్రేమ, వివాహం, గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులను ఇందులో చూపించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

ముఖ్యంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత సోనియా గాంధీ ఎదుర్కొన్న పరిస్థితులు, పిల్లలను పెంచిన తీరు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. అలాగే ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ ఆమె వెనక్కి తగ్గిన సందర్భాలు, దేశ రాజకీయాల్లో ఆమె పాత్రను కూడా కథలో చూపించనున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు.
ఈ సినిమా నిర్మాణం విషయంలోనూ జగ్గారెడ్డి ఓ కీలక విషయం వెల్లడించారు. ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. బయటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడతామని చెప్పారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం ఏంటి.?
[Sonia Gandhi Biopic, Director Kranthi Madhav, Jagga Reddy, Sonia Gandhi]




