సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం ఏంటి.?
Nov 29, 2026 12:30PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో శనివారం (నవంబర్ 28) ఈ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్ పుష్పగుచ్ఛం అందించగా, ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.
మహేశ్ బాబు, రేవంత్ రెడ్డి కొద్దిసేపు సమావేశమై పలు అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీలో ఏయే విషయాలు చర్చకు వచ్చాయనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇది మర్యాదపూర్వక భేటీగానే జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారిక సోషల్ మీడియా ఖాతా పేర్కొంది.
అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనే ఆసక్తి మొదలైంది. సినిమా రంగానికి సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నారా? లేక ఇతర అంశాలపై చర్చించారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
మొత్తానికి మహేశ్ బాబు, రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశం వెనుక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అన్నది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఆటో జానీ గుర్తున్నాడా?.. కాకాలో చిరంజీవి వింటేజ్ అవతార్ అదిరింది.!
[Mahesh Babu, Revanth Reddy, Telangana, Hyderabad, Varanasi]




