
తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల ఎంట్రీపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, సీఎం అయిన తర్వాత.. పలువురు సినీ నటుల రాజకీయ ఆసక్తిపై చర్చ మొదలైంది. తాజాగా ఈ జాబితాలోకి శివకార్తికేయన్ పేరు కూడా చేరింది.
శివకార్తికేయన్ ఆదివారం చెన్నైలో తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను పీపుల్ మేడ్ స్టార్‌ని. మీ వల్లే ఈ స్థాయికి వచ్చాను” అని అన్నారు. ఏ రంగంలో ఉన్నా తమ లక్ష్యంపై క్లారిటీ ఉండాలని అభిమానులకు సూచించారు. విమర్శించే వాళ్లు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని.. వాటిని పట్టించుకోకుండా ప్రేమతో కలిసి ఉండాలని చెప్పారు.
ఇక సమావేశానికి హాజరైన విద్యార్థులకు కూడా శివకార్తికేయన్ కొన్ని సూచనలు చేశారు. బాగా చదవాలని, బాగా సంపాదించాలని.. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎక్కువగా చదివితే ఆలోచనా విధానం మెరుగవుతుందని.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండొచ్చని చెప్పారు.

అయితే ఈ ఫ్యాన్ మీట్‌కు పొలిటికల్ కలర్ రావడానికి మరో కారణం ఉంది. తమిళనాట ప్రస్తుతం హీరోలు వరుసగా అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ధనుష్, విశాల్ కూడా తమ ఫ్యాన్స్‌తో భేటీ అయ్యారు. ప్రజాసేవకు సంబంధించిన అంశాలపై వారు మాట్లాడారు.
మరోవైపు కొరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తమిళ సినీ ప్రముఖుల ఫ్యాన్ మీట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అయితే శివకార్తికేయన్ మాత్రం తన తాజా సమావేశంలో రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన మాటలన్నీ అభిమానులు, విద్యార్థులు, కుటుంబం, చదువు, వ్యక్తిగత ఎదుగుదల చుట్టూనే ఉన్నాయి.
మరి శివకార్తికేయన్ భవిష్యత్తులో రాజకీయాల వైపు అడుగులు వేస్తారా? లేక ఫ్యాన్స్‌తో ఈ సమావేశం కేవలం అభిమానుల కోసం నిర్వహించిన కార్యక్రమంగానే మిగిలిపోతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: డీప్‌ఫేక్ వివాదం.. ఇంటి దొంగల పనే.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్.!
[Sivakarthikeyan Political Entry, Sivakarthikeyan Fans Meet, Sivakarthikeyan Politics, Sivakarthikeyan Meeting, Sivakarthikeyan Comments, Sivakarthikeyan, Tamil Nadu CM Vijay, Telugu News]





