
ఆన్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ది స్క్రీన్ కూడా నేను హీరోనే అంటూ ఒక రేంజ్ లో మాటల తూటాలతో దూసుకుపోతున్నాడు 'ఓ అందాల రాక్షసి' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో, దర్శకుడు షిరాజ్ మెహది, తాజాగా ఈ హీరో చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహది మాట్లాడుతూ.. ఇండస్ట్రీని శాసిస్తున్న కొద్దిమంది వ్యక్తుల తీరు వల్ల వందలాది మంది చిన్న నిర్మాతలు, నూతన దర్శకులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం థియేటర్ల కొరత, సిండికేట్ల ఆధిపత్యం కారణంగా తాము పడుతున్న ఆర్థిక ఇబ్బంది సాధారణమైనది కాదన్నారు. ఇప్పటికే చిన్న సినిమాల సమస్యలపై 40కి పైగా ప్రెస్‌మీట్లు నిర్వహించి, 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చానని ఆయన గుర్తుచేశారు. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ (ADCC) ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూబ్, యుఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్లు వారానికి సుమారు 2,000 ఖర్చుతో పూర్తయ్యే పనులకు ఒక్కో థియేటర్ నుంచి ఏకంగా 10,000 నుంచి 12,000 వరకు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆర్థిక భారాల వల్ల చిన్న నిర్మాతలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారని గణాంకాలతో సహా వివరించారు.
ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ సునామీ: మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు!

పరిశ్రమలో కొంతమంది పెద్దల గుప్పిట్లో థియేటర్ల వ్యవస్థ నలుగుతోందని, చిన్న సినిమాలను కావాలనే తొక్కేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గళాన్ని నొక్కివేసేందుకు ఎన్నో రకాల బెదిరింపులు వస్తున్నప్పటికీ, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని షిరాజ్ మెహది స్పష్టం చేశారు. చిన్న సినిమాల బతుకుదెరువు కోసం, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తేల్చిచెప్పారు. అవసరమైతే వంద ప్రెస్‌మీట్లు పెట్టి ఇండస్ట్రీలోని లోపాలను, అక్రమాలను ఎత్తిచూపుతానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, తమ చిత్రాన్ని అణచివేయాలని చూసినా చట్టపరంగానే కాక, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. చిన్న సినిమా బతికితేనే టాలీవుడ్ కళకళలాడుతుందని, కొత్త ప్రైవేట్ టాలెంట్ బయటకు వస్తుందని షిరాజ్ మెహది స్పష్టం చేశారు.
[Sheraz Mehdi wont Bow To Threats, Sheraz Mehdi, Tollywood theater mafia, O Andala Rakshasi, small movies struggle, Film Chamber controversy, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






