సోలో హీరోయిన్గా సో బెటర్!
on May 19, 2020
చూసీ చూడంగానే తెలుగు కుర్రకారుకు నచ్చేసిన అందం రష్మికా మందన్న. ‘ఛలో’తో మొదలైన ఈ కన్నడ కస్తూరి తెలుగు చిత్ర ప్రయాణం ‘భీష్మ’ వరకు సక్సెస్‌ఫుల్‌గా సాగింది. మధ్యలో ఒకటీ అరా పరాజయాలున్నా సింహభాగం విజయాలే చూసింది ఈ క్రేజీ బ్యూటీ.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రష్మిక తెలుగునాట ఇప్పటి వరకు 'ఒక కథానాయకుడు - ఇద్దరు నాయికలు' తరహా చిత్రాలకు దూరంగా ఉంటూ.. ‘సోలో హీరోయిన్’ వేషాలకే పెద్ద పీట వేస్తూ వస్తోంది. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘దేవదాస్’(ఈ మల్టీస్టారర్‌లో నాగార్జునకి జోడిగా ఆకాంక్ష సింగ్ నటిస్తే.. నానికి జంటగా రష్మిక కనిపించింది.), ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇలా రష్మిక తెలుగు చిత్రాలన్నీ 'సింగిల్ హీరోయిన్' చుట్టూ తిరిగే హీరోల కథలే కావడం విశేషం. అంతేకాదు.. రష్మిక నెక్స్ట్ వెంచర్ ‘పుష్ప’ కూడా ఈ తరహా చిత్రమే కావడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికది 'సోలో హీరోయిన్' వేషమే. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే.. యాదృచ్ఛికమో మరొకటో తెలియదుగాని రష్మిక మాత్రం ‘సోలో హీరోయిన్‌గానే సో బెటర్’ అనుకుంటూ ముందుకు వెళుతున్నట్టవుతోంది. మరి.. మున్ముందు కూడా రష్మిక ఇదే శైలిని కొనసాగిస్తుందేమో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. తెలుగునాట 'సోలో హీరోయిన్'గా సినిమాలు చేస్తున్న రష్మిక.. కెరీర్లో తన తొలిచిత్రమైన ‘కిరిక్ పార్టీ’ (కన్నడ)లో మాత్రం ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా దర్శనమిచ్చింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే మరో హీరోయిన్గా నటించింది. అలాగే మరో కన్నడ చిత్రం ‘యజమాన’లోనూ ఇద్దరు నాయికల్లో ఒకరిగా నటించింది రష్మిక. దర్శన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో తాన్యా హోప్ మరో హీరోయిన్గా దర్శనమిచ్చింది.