నిర్మాతకు రాజమౌళి ఏమీ చెప్పడం లేదా?
on May 19, 2020
భారతీయ బాక్సాఫీస్ చరిత్రను తిరగ రాసి, సరికొత్త రికార్డులు లిఖించిన 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇది భారీ బడ్జెట్ చిత్రమే. సుమారు 200 నుండి 250 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. 'బాహుబలి 2' తర్వాత రాజమౌళితో సినిమా చేసే అవకాశం రావడంతో ఆయనను అందరూ అదృష్టవంతుడిని అన్నారు. అయితే, ఆ అదృష్టం డబ్బులు పెట్టడం వరకేనా? మిగతా విషయాలు ఏవి నిర్మాతకు రాజమౌళి చెప్పడం లేదా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల చేసే విషయమై నిర్మాత కు సరైన సమాచారం లేకపోవడంతో ఇటువంటి సందేహాలు వస్తున్నాయి.
లాక్ డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోవడంతో ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఏదీ విడుదల చేయలేక పోతున్నామని 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. అధికారిక ఆంక్షల వలన కుదరలేదని ఎన్టీఆర్ సైతం చెప్పారు. మూడు రోజుల క్రితం డి.వి.వి. దానయ్య ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఎన్టీఆర్ పుట్టినరోజు కి రాజమౌళి ఏదో ప్లాన్ చేస్తున్నారు" అని అన్నారు. సరైన సమాచారం లేక నిర్మాత అలా చెప్పారా? లేదా చివరి క్షణం వరకు ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంతో అన్నారు? ఏది ఏమైనా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని స్పష్టం అవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు తీసే నిర్మాతలు ఇటువంటి విషయాల్లో అవగాహన సరైన సమాచారం లేకుండా మాట్లాడితే లేనిపోని అనుమానాలు వస్తాయి.