డిసెంబర్‌లోగా రానా, మిహీకా పెళ్లి!
on May 13, 2020
టాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడు అయిన రానా దగ్గుబాటి డిజైనర్ మిహీకా బజాజ్‌తో తన ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించాడు. తమ మధ్య అనుబంధం ఎంత బలమైందో ఒక మెసేజ్ ద్వారా వారు తెలిపారు. రానా కాబోయే భార్య మిహీకాది సినీ నేపథ్యం కాదు. ప్రొఫెషన్ పరంగా ఆమె ఒక డిజైనర్. సొంతంగా డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతోంది.
ఈ ఏడాది చివరలో వాళ్లు వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని రానా తండ్రి, సీనియర్ నిర్మాత డి. సురేశ్‌బాబు వెల్లడించారు. డిసెంబర్లో కానీ, అంతకంటే ముందుకానీ వారి వివాహం జరపాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ, ఇటు రానా, అటు మిహీకా కుటుంబాలు రెండు పెళ్లి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పాపులర్ వెడ్డింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల నుంచి మిహీకా ఇన్స్పిరేషన్ పొందుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేరుపొందిన మెహందీ ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫ్లవర్ డెకరేషన్ కంపెనీల అకౌంట్లను ఫాలో అవుతుండటం దీనికి నిదర్శనం. దీన్ని బట్టి చూస్తుంటే.. ఒక అందమైన పెళ్లి వేడుకను ఆమె కల కంటోందనేది స్పష్టం. అంటే రానా, మిహీకా వివాహం వైభవంగా జరిగే అవకాశాలున్నాయన్న మాట.
నగల వ్యాపారులు బంటీ, సురేశ్ బజాజ్ దంపతుల కుమార్తె మిహీకా. ఆమెకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఆమెకు సన్నిహితురాలు. అందుకే రానా, మిహీకా జంటకు సోనమ్ అభినందనలు తెలపడమే కాకుండా, తమ కుటుంబంలోకి వస్తున్న రానాకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఆమె భర్త ఆనంద్ బజాజ్ అనే విషయం తెలిసిందే. అతను మిహీకాకు సమీప బంధువు.