
ఒక్కొక్కలకి ఒక్కో టైం అన్నట్టుగా ఇప్పుడు పెళ్లిళ్ల టైం సినిమా హీరోల వంతు వచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు తేజ సజ్జా, సాయి ధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అయిపోయారు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సైతం వివాహబంధంలోకి అడుగుపెట్టాడు.
కన్నడ శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర కుటుంబంలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. ఉపేంద్ర అన్న సుధీంద్ర కుమార్, వీణ దంపతుల కుమారుడు, టాలీవుడ్ మరియు శాండల్‌వుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ హీరో నిరంజన్ సుధీంద్ర వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ (స్త్రీరోగ నిపుణురాలు)గా సేవలందిస్తున్న డాక్టర్ సంజనా బి. రాజ్‌తో నిరంజన్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెద్దల అంగీకారంతో, అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు ఒక్కటయ్యారు.
బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ రిసార్ట్ మరియు విలాసవంతమైన హోటల్లో వీరి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హల్దీ, మెహందీ, సంగీత్ గ్రాండ్ రిసెప్షన్ కార్యక్రమాల్లో ఉపేంద్ర కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ముఖ్యంగా హల్దీ వేడుకలో నిరంజన్ సుధీంద్ర తన తల్లి వీణతో పాటు బాబాయ్ ఉపేంద్ర, పిన్ని ప్రియాంక ఉపేంద్రలతో కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో చిందులేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

తమ ప్రేమకథ గురించి నిరంజన్ సుధీంద్ర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమది 'లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్' అని ఆయన ఎంతో సంతోషంగా తెలిపారు. కొంతకాలం క్రితం స్నేహితుల ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. సంజనాలోని స్వతంత్ర భావాలు, అందరిపై చూపే ప్రేమ, ఆప్యాయత మరియు బాధ్యతాయుతమైన స్వభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని నిరంజన్ మనసులోని మాటను బయటపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో ఈ పెళ్లి పీటలెక్కింది.
ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్ తల్లి నిర్వాహకం:ప్రెగ్నెన్సీ ఉందన్న సోయిలేదు.. రోజుకు 100 సిగరెట్లు తాగేసింది!
వధువు డాక్టర్ సంజనా రాజ్ నేపథ్యం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఆమె బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇటీవలే ఎం.ఎస్ (MS) చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసిన సంజనా, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి కుటుంబం మూలాలు మైసూరులో ఉన్నప్పటికీ, గత 10 సంవత్సరాలుగా బెంగళూరులోనే స్థిరపడ్డారు.
ఇక హీరో నిరంజన్ సుధీంద్ర సినీ ప్రయాణం విషయానికి వస్తే.. చిన్నతనంలోనే దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ నటించిన 'బళ్లారి నాగ' చిత్రంలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'సెకండ్ హాఫ్' సినిమాతో హీరోగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అనంతరం 'నమ్మ హుడుగరు' చిత్రంతో పాటు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతాపయణం' లో హీరోగా నటించి మెప్పించారు.

ప్రస్తుతం 'హంటర్' అనే యాక్షన్ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో నిరంజన్ బిజీగా ఉన్నారు. ఉపేంద్ర కుటుంబంలో తర్వాతి తరానికి చెందిన మొదటి వివాహం ఇదే కావడంతో, శాండల్‌వుడ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఈ జంటకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు నచ్చవచ్చు:ధురంధర్ 2 కలెక్షన్స్ ని రామాయణ దాటిందా: అసలు లెక్కలివే!
మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్!
[Niranjan Sudhindra , Upendra, Priyanka, Dr Sanjana Raj, Tollywood]





