Home

»

Latest News

మూడు సార్లు రిజెక్ట్ చేశాను.. 12 ఏళ్ల త‌ర్వాత అత‌ని కోస‌మే మేక‌ప్ వేసుకున్నాను.!

Nov 10, 2026 11:42AM

మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ‘రాజా రాణి’, ‘నేరం’, ‘ఓం శాంతి ఓషానా’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు దాదాపు 12 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. అయితే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు సూర్య నటించిన ‘సీన్‌’ సినిమాతో మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందో నజ్రియా వెల్లడించారు.

తమిళంలో చివరిగా 2014లో ‘తిరుమణం ఎనుమ్ నిక్కా’ సినిమాలో కనిపించారు నజ్రియా. ఆ తర్వాత మళ్లీ తమిళ సినిమా చేయలేదు. అయితే కథలు నచ్చకనో, అవకాశాలు రాకనో తాను సినిమాలకు దూరంగా ఉండలేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. గత 12 ఏళ్లలో తాను ఆశించిన కథ, పాత్ర తన దగ్గరకు రాలేదని నజ్రియా చెప్పుకొచ్చారు. అందుకే తమిళ సినిమాల్లో నటించలేకపోయానని, ఇప్పుడు తనకు నచ్చిన కథతో తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక ‘సీన్‌’ సినిమాతో సూర్యతో కలిసి నటించే అవకాశం రావడం కూడా తనకు ప్రత్యేకమని నజ్రియా వెల్లడించారు. చిన్నప్పటి నుంచి సూర్య సినిమాలు చూస్తూ ఆయనకు అభిమానిగా ఉన్నానని, సినిమా కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోవడానికి కూడా ఆయన ఒక కారణమని చెప్పారు. సూర్యతో కలిసి నటించాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు జితు మాధవన్ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు సూర్య గతంలో ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తన సినిమాల్లో నటించేందుకు నజ్రియాను మూడుసార్లు సంప్రదించామని, ఆమె అంగీకరించలేదని సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నజ్రియా అసలు విషయం చెప్పుకొచ్చారు. సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదని, డేట్స్ సమస్యలు, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు కుదరలేదని స్పష్టం చేశారు. ‘సూర్య సర్ సినిమా అవకాశాన్ని నేనెలా వద్దంటాను?’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఇక ‘సీన్‌’ సినిమాలో నజ్రియా మాయ అనే పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించడం విశేషం. ఇప్పటివరకు తనను ఎక్కువగా క్యూట్, చలాకీ పాత్రల్లో చూసిన అభిమానులకు ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 6న దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

సాధారణంగా హీరోయిన్లు సినిమాలకు గ్యాప్ ఇస్తే అవకాశాలు తగ్గిపోయాయని, కథలు నచ్చకపోవడంతోనే దూరంగా ఉన్నారని రకరకాల చర్చలు జరుగుతుంటాయి. కానీ నజ్రియా మాత్రం తనకు నచ్చిన కథ, పాత్ర కోసం ఎదురుచూశానని స్పష్టం చేశారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఇకపై ఎలాంటి కథలను ఎంచుకుంటారో చూడాలి. 

 

 

[Nazriya Nazim, Nazriya 12 Years Gap, Nazriya Tamil Cinema Comeback, Nazriya Suriya Scene Movie, Nazriya Latest News, Suriya Nazriya First Movie, Nazriya Acting Career, Nazriya Movie Updates, Scene Movie 2026, Jithu Madhavan, Nazriya Interview, Malayalam Actress Nazriya]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com