15 ఏళ్ల సోలో: నారా రోహిత్ కెరీర్లో స్పెషల్ మూవీ.. ఇప్పటికీ అదే మ్యాజిక్.!
Nov 25, 2026 10:36AM

కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులను అలరిస్తాయి. మరికొన్ని సినిమాలు సంవత్సరాలు గడిచినా గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో నారా రోహిత్ నటించిన ‘సోలో’ ఒకటి. ఈ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, నారా రోహిత్ కెరీర్లోనే కాదు.. దర్శకుడు పరశురామ్ ప్రయాణంలోనూ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది.
‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన నారా రోహిత్, రెండో సినిమాతోనే తనలో మరో కోణాన్ని చూపించారు. తొలి సినిమాలో సీరియస్ పాత్రలో కనిపించిన ఆయన, ‘సోలో’లో ప్రేమ, కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన పాత్రలో ప్రేక్షకులను పలకరించారు. అప్పట్లో ఈ సినిమా ప్రచారంలో ‘ఎ సాలిడ్ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఆసక్తిని పెంచింది.
15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా గురించి నారా రోహిత్ చేసిన పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. "కొన్ని నవంబర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రెండు అందమైన సినిమా ప్రయాణాలు.. ఒకటి రౌడీ ఫెలో, మరొకటి సోలో. సోలో 15 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కాలం గడిచిపోతుంది.. కానీ ప్రేమ, జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. నిజంగా అదృష్టవంతమైన నవంబర్" అంటూ రోహిత్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్, హీరోయిన్ నిషా అగర్వాల్‌ను కూడా ట్యాగ్ చేశారు.

‘సోలో’ కథ విషయానికి వస్తే.. గౌతమ్ (నారా రోహిత్) ఓ అనాథ. చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలను అనుభవించాలని కోరుకుంటాడు. అలాంటి గౌతమ్ జీవితంలోకి వైష్ణవి (నిషా అగర్వాల్) వస్తుంది. ఆమెను ప్రేమించిన గౌతమ్, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే వైష్ణవి తండ్రి రఘుపతి నాయుడు (ప్రకాష్ రాజ్) మాత్రం తన కూతురిని మంచి కుటుంబంలోకి పంపించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ప్రేమకు, కుటుంబ బంధాలకు మధ్య జరిగే సంఘర్షణే సినిమా ప్రధాన కథాంశం.
ఇది కూడా చదవండి: ఫ్రెంచ్ అమ్మాయితో సింగీతం ప్రయోగం.. ‘అమెరికా అమ్మాయి’కి 50 ఏళ్లు.!
ఈ సినిమాలో నారా రోహిత్, నిషా అగర్వాల్ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, జయసుధ, సాయాజీ షిండే వంటి సీనియర్ నటులు కథకు బలంగా నిలిచారు. అలీ, ఎంఎస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్ వంటి నటులు తమ పాత్రలతో వినోదాన్ని పంచారు. అప్పట్లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు, ప్రేమకథకు జోడించిన ఎమోషన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరోవైపు మణిశర్మ అందించిన సంగీతం కూడా ‘సోలో’కు మంచి అసెట్‌గా నిలిచింది. పాటలు అప్పట్లో యువతను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమకథకు సంగీతం చక్కగా కుదిరింది.

దర్శకుడిగా పరశురామ్ తనదైన శైలిలో ప్రేమ, కుటుంబ అనుబంధాలను కలిపి సినిమాను తెరకెక్కించారు. ‘యువత’, ‘ఆంజనేయులు’ తర్వాత ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
నారా రోహిత్ కెరీర్‌ను పరిశీలిస్తే ‘సోలో’ తర్వాత ఆయన ఎంచుకున్న కథలు, పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కథకు, పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ ప్రయోగాలు చేయడం ఆయన ప్రత్యేకతగా మారింది.
15 ఏళ్లు గడిచినా ‘సోలో’ను గుర్తుచేసుకుంటూ నారా రోహిత్ చేసిన పోస్ట్ చూస్తుంటే, ఆ సినిమా ఆయనకు ఎంత ప్రత్యేకమో అర్థమవుతోంది.
మీకు నచ్చవచ్చు:
బిగ్ అప్డేట్.. బాలయ్య ‘దాదా’తో బాక్సాఫీస్ జాతర ఖాయం.!
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!
[15 Years Of Solo, Nara Rohith, Parasuram, Nisha Agarwal, Rowdy Fellow]




