
సోషల్ మీడియాలో పాటలు, టీజర్‌తో ఆసక్తి రేపుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనలో ఆసక్తి కలిగించిందని, గరివిడి లక్ష్మి ఎవరు? ఆమె కథేంటి? అని ఆరా తీసినట్లు వెల్లడించారు. బుర్రకథ కళనే జీవితంగా బతుకుతూ, ఆ కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందడం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
చదువుకోకపోయినా సంప్రదాయ బుర్రకథకు ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలను జోడించి ఆ కళకు కొత్త వన్నె తీసుకొచ్చిన గరివిడి లక్ష్మి కథను తెరపై చూసేందుకు తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నారా లోకేశ్ తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు.
జానపద కళలకు ఆదరణ తగ్గుతోందనే చర్చ జరుగుతున్న తరుణంలో, బుర్రకథ కళాకారిణి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్రకు చెందిన రెడ్డి విజయలక్ష్మి జీవిత ప్రయాణం, ఆమె కళా ప్రస్థానం ఈ సినిమాకు ప్రధాన ఆధారం. సంప్రదాయ బుర్రకథలో స్థానిక జానపద పదాలను కలిపి ప్రేక్షకులకు చేరువ చేసిన ఆమె జీవితంలోని విశేషాలను ఈ చిత్రం పరిచయం చేయనుంది.
ఈ సినిమాలో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తుండగా, ఆమె తల్లిగా రాశి కనిపించనున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాధారణంగా బయోపిక్‌లు అంటే ప్రముఖుల జీవితాలకే పరిమితమవుతుంటాయి. కానీ గ్రామీణ కళను తన జీవితంగా మలుచుకున్న ఓ కళాకారిణి కథను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలుస్తోంది.
నారా లోకేశ్ ప్రశంసలతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. మరి అక్టోబర్ 17న విడుదల కానున్న గరివిడి లక్ష్మి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: గరివిడి లక్ష్మి ఎవరు: బయోపిక్ తీసే అంతలా ఆమె ఏం చేసింది.?
[Nara Lokesh Tweet On Garividi Lakshmi, Nara Lokesh Twitter, Garividi Lakshmi Movie, Actress Anandhi, Reddy Vijayalakshmi, Burrakatha Artist, Nara Lokesh, Garividi Lakshmi, Telugu Film News]






