Home

»

Latest News

మళ్ళీ ఫ్యామిలీ బాటలో నాని: ప్యారడైజ్ దెబ్బకు రక్తపాతానికి గుడ్‌బై.!

Oct 9, 2026 4:35PM

నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు గుర్తొచ్చే సినిమాలు ఎన్నో. ప్రేమకథలు, కామెడీ, కుటుంబ అనుబంధాలు.. ఇలా తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ‘దసరా’తో మాస్ ఇమేజ్‌పై దృష్టి పెట్టిన నాని.. ఆ తర్వాత ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాలతో మరింత రా అండ్ రస్టిక్ యాక్షన్ బాట పట్టారు. కానీ ఇప్పుడు నాని మళ్లీ తన పాత స్టైల్‌లోకి వస్తున్నారా? ఆయన కొత్త సినిమాల లైనప్ చూస్తే ఇదే అనిపిస్తోంది.

ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి తిరుగులేని క్రేజ్ ఉంది. కానీ, నాని మాత్రం ఆ ఇమేజ్ కి దూరంగా జరుగుతూ.. వయలెంట్ సినిమాలతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.  అయితే వరుసగా హింసాత్మక కథల్లో కనిపించడం వల్ల ఆయన నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆశించే ప్రేక్షకులకు కొంత అసంతృప్తి ఏర్పడిందనే చర్చ సాగింది. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’పై వచ్చిన విమర్శల నేపథ్యంలో నాని తదుపరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ‘బ్లడీ రోమియో’ రూపొందుతోంది. ఈ సినిమా కూడా యాక్షన్‌తోనే సాగనుంది. అయితే గత చిత్రాల్లో కనిపించినంత రా అండ్ రస్టిక్ వైలెన్స్ కాకుండా, యాక్షన్‌లో కొత్త తరహా వినోదం ఉంటుందని నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక ‘బ్లడీ రోమియో’ తర్వాత తాను చేయబోయే సినిమా ప్రేమకథ అని, పిల్లలు సహా అన్ని వయసుల ప్రేక్షకులు చూడగలిగేలా ఉంటుందని నాని స్వయంగా వెల్లడించారు. 

నాని తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ప్రేమ్ కుమార్ పేరు. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి భావోద్వేగభరితమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడితో నాని ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే.. నాని నుంచి మరో ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ వచ్చే అవకాశం ఉంది.

అలాగే ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ సినిమాల తర్వాత నాని – శివ నిర్వాణ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ సినిమాల్లో కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. 

మొత్తానికి ‘బ్లడీ రోమియో’ తర్వాత ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాల వైపు అడుగులు వేస్తే.. నాని తన పాత బలాన్ని మళ్లీ గుర్తు చేసినట్టే. మరి ఈ నేచురల్ స్టార్ మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటారా? రాబోయే సినిమాలే దీనికి సమాధానం చెప్పాలి.

ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్‌పై మెగా అభిమానుల గుర్రు.. ఆచార్యపై సెటైర్ అవసరమా.?

 

 

 

[Nani Back To Family Zone, Nani Upcoming Movies, Nani Family Movies, The Paradise Movie, Nani Paradise Movie, Natural Star Nani, Bloody Romeo, Prem Kumar, Shiva Nirvana, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com