
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన హిట్ చిత్రాల్లో మాస్టర్ ఒకటి. ముఖ్యంగా ఈ చిత్రంలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్. చిరంజీవి ఈ చిత్రంతోనే గాయకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఘనత మాస్టర్ కి సంగీతాన్ని అందించిన తమిళ సంగీత దర్శకుడు దేవాది.ఈ లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలోని కోడంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
1950 నవంబర్ 20న దేవానేసన్ చొక్కాలింగంగా జన్మించిన ఆయన, సంగీత ప్రపంచంలో 'దేవా'గా చెరగని ముద్ర వేశారు. 36 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏకంగా 400 కంటే ఎక్కువ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి స్వర దిగ్గజంగా నిలిచారు.
చిన్ననాటి నుంచే సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న దేవా, వెస్ట్రన్ మ్యూజిక్ మాస్టర్ ధన్రాజ్ వద్ద పాశ్చాత్య సంగీతం అభ్యసించడమే కాకుండా లండన్లోని ప్రసిద్ధ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి కోర్సు పూర్తి చేశారు. సినీ రంగంలోకి రాకముందు ఆయన కొంతకాలం దూర్దర్శన్ పోదిగై ఛానెల్లో పనిచేస్తూ 'వయలుమ్ వాల్వుమ్' వంటి కార్యక్రమాలకు స్వరాలు అందించారు. 1989లో 'మనసుక్కేత్త మహరాసా' సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయనకు, 1990లో వచ్చిన 'వైగాసి పొరంతాచు' సినిమాతో బ్రేక్ లభించింది. ఈ చిత్రానికిగాను ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని సైతం గెలుచుకున్నారు.
దేవా సంగీత ప్రయాణంలో 1990ల కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. చెన్నై వీధుల్లో మాత్రమే వినిపించే గానా పాటలను తన వైవిధ్యభరితమైన ఈట్లతో వెండితెరపైకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అన్నామలై' (1992), 'బాషా' (1995), 'అరుణాచలం' (1997) చిత్రాలకు ఆయన అందించిన నేపథ్య సంగీతం మరియు పాటలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా బాషా చిత్రంలోని థీమ్ మ్యూజిక్, అన్నామలై టైటిల్ కార్డ్ మ్యూజిక్ నేటికీ సంచలనమే. 1996 ఒక్క ఏడాదిలోనే దేవా ఏకంగా 36 సినిమాలకు సంగీతం అందించడం ఆయన అపరిమితమైన ప్రతిభకు, డిమాండ్కు నిదర్శనం.
ఇది కూడా చదవండి: Garividi Lakshmi Movie Review Telugu: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ
తమిళంతో పాటు తెలుగులోనూ 'మాస్టర్', 'చంటి', 'తోడు దొంగలు' వంటి అనేక చిత్రాలకు దేవా స్వరాలు అందించారు. కమల్ హాసన్ 'అవ్వై షణ్ముఖి' (భామనే సత్యభామ), విజయ్ 'ఖుషి', అజిత్ 'వాలి', 'ఆసై' వంటి చిత్రాలు ఆయన సంగీత ప్రస్థానంలో మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన అందించిన విశేష సేవలకుగాను 1992లో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'కలైమామణి' పురస్కారంతో సత్కరించింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆయనకు ఇచ్చి గౌరవించిన 'తేనిసై తెండ్రల్' (తేనెలాంటి తీయని గాలులు) అనే బిరుదు ఆయన మధుర స్వరాలకు అద్దం పడుతుంది.
75 ఏళ్ల వయసులో దేవా భౌతికంగా మనల్ని విడిచివెళ్లినప్పటికీ, ఆయన అందించిన వందలాది జానపద, గానా మరియు మధురమైన మెలోడీ పాటలు భారతీయ సంగీత చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు మరియు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
[Music Director Deva Passes Away, Music Director Deva, Deva Passed Away, Music Director Deva Passed Away, Thenisai Thendral Deva, Tamil Composer Deva Death, Telugu Cinema News, Tollywood, Tollywood News]






