
మోహన్ బాబు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ. ఎలాంటి డైలాగ్ అయినా తనదైన మాడ్యులేషన్‌తో చెప్పడం ఆయనకు మొదటి నుంచీ ఉన్న ప్రత్యేకత. అలాంటి మోహన్ బాబు నటనలో మరో కోణాన్ని చూపించిన సినిమా ‘రాయలసీమ రామన్న చౌదరి’.
ఇటీవల ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో నాని కూడా మోహన్ బాబు నటన గురించి మాట్లాడుతూ ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీని నాని కొనియాడారు. ఇక ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు క్రూరమైన నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో.. ‘రాయలసీమ రామన్న చౌదరి’ మరోసారి చర్చలోకి వచ్చింది.
2000 సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించగా.. మణిశర్మ సంగీతం అందించారు.
కథ ఏంటంటే... పెద్ద కుటుంబానికి చెందిన రామన్న చౌదరి గతంలో తన కుటుంబానికి ఎదురైన అనుభవాల వల్ల నాస్తికుడిగా మారి.. మంచి చెడ్డా చూసుకోకుండా అందరి భూములు లాగేసుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి.. చివరికి దేవుడి గొప్పదనాన్ని తెలుసుకునే పాయింట్ తో ఇది రూపొందింది.
ఈ సినిమాలో మోహన్ బాబు రామన్న చౌదరి, మురళి అనే రెండు పాత్రల్లో కనిపించగా.. రామన్న చౌదరి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రామన్న చౌదరి పాత్రను మోహన్ బాబు పోషించిన తీరు ఇప్పటికీ మాట్లాడుకునేలా చేసింది. ఆయన నడక, చూపు, డైలాగ్ చెప్పే స్టైల్.. ప్రతిదాంట్లోనూ ఓ ప్రత్యేకమైన పవర్ కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ: రక్తపాతంలో కొత్త బెంచ్ మార్క్.. అసలు ఈ కాకుల కథేంటి.?
అందులోనూ పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్‌కు మోహన్ బాబు తన వాయిస్‌తో ఇచ్చిన ఇంపాక్ట్ మరో లెవల్. ‘గుర్రానికి కాళ్లల్లో బలం.. సింహానికి నోట్లో బలం.. గరుడ పక్షికి కంట్లో బలం.. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్లంతా బలమేరా’ అనే డైలాగ్ అప్పట్లో థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అంతేకాదు.. రామన్న చౌదరి పాత్రకు సంబంధించిన తమలపాకు సన్నివేశం కూడా సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది. ఆయన తమలపాకును తిప్పుతూ ‘వెయ్యనా తిప్పనా’ అని చెప్పే మేనరిజమ్ పాత్రకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
మోహన్ బాబు డైలాగ్ చెప్పే విధానంలో ఓ ప్రత్యేకమైన రిథమ్ ఉంటుంది. ఎక్కడ వాయిస్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఏ పదాన్ని ఒత్తి చెప్పాలి అనే విషయంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ‘రాయలసీమ రామన్న చౌదరి’లో ఆ స్టైల్ పూర్తిగా కనిపించింది. అందుకే సినిమా చూసిన తర్వాత కథ కంటే కూడా కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు, మోహన్ బాబు మేనరిజమ్స్ ఎక్కువగా గుర్తుండిపోయాయి.
‘రాయలసీమ రామన్న చౌదరి’ విడుదలై 26 ఏళ్లయినా.. మోహన్ బాబు నటన గురించి మాట్లాడినప్పుడల్లా ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం రామన్న చౌదరి పాత్రకు ఆయన ఇచ్చిన ఇంపాక్ట్.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో మరోసారి మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటంతో.. ‘రాయలసీమ రామన్న చౌదరి’లో ఆయన చూపించిన ఆ ఇంటెన్సిటీని గుర్తు చేసుకుంటున్నారు. ‘ది ప్యారడైజ్’లో షికంజా మాలిక్‌గా ఆయన ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాని కూడా మోహన్ బాబు పాత్రను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని చెబుతున్నారు.
మీకు నచ్చవచ్చు:
మోహన్ బాబు విలనిజం.. మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.!
24 ఏళ్ళ తర్వాత వేరే హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన బాలయ్య.!
[Rayalaseema Ramanna Chowdary Movie, Mohan Babu Dialogues, Mohan Babu Movies, The Paradise Movie, Nani Paradise, Srikanth Odela, Telugu Film News, Telugu News]




