
టైటిల్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇక ట్రైలర్ చూస్తే నవ్వులు, ప్రేమ, గందరగోళం.. ఇలా అన్నీ కలిపి ఓ ఫన్ రైడ్‌లా కనిపిస్తోంది. అదే రాకేష్ వర్రే నటిస్తున్న 'మాయ లేడీ'. ఇప్పటికే టీజర్, పాటలతో కొంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ముఖ్యంగా ఇందులో ట్విన్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమెకు మరో కవల సోదరి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? పైగా ఆ ఇద్దరి మధ్య అస్సలు పడకపోతే.. ప్రేమించిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ పాయింట్ చుట్టూనే దర్శకుడు ప్రాసంకర్ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాలో రాకేష్ వర్రే కృష్ణ అనే యువకుడిగా కనిపిస్తున్నారు. అతడు ఓ కరాటే కోచ్. పెళ్లి చేసుకునే ముందు తనకు నచ్చిన అమ్మాయిని వెతుక్కోవాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఆశ(మధుమిత సర్కార్) పరిచయమవుతుంది. ఆమె వ్యక్తిత్వం నచ్చడంతో కృష్ణ ప్రేమలో పడతాడు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. ఆశకు రూప అనే కవల సోదరి ఉంటుంది. ఆశ అనుకొని కృష్ణ రూపకి దగ్గరవుతాడు. ఆ ట్విన్ సిస్టర్స్ మనస్తత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండటమే కాకుండా.. ఒకరంటే ఒకరికి పడదు. దీంతో కృష్ణ జీవితంలో అనుకోని గందరగోళం మొదలవుతుంది. అసలు ఆశతో ప్రేమలో పడిన కృష్ణకు రూప వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరకు అతడి ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం.
రాకేష్ వర్రే గతంలో 'ఎవరికీ చెప్పొద్దు', 'పేక మేడలు' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ఆయనకు మంచి అభిరుచి ఉందనే పేరుంది. ఈసారి మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ట్రైలర్లో ప్రేమలో పడినప్పుడు కనిపించే ఆనందం నుంచి.. ఇద్దరు ట్విన్ సిస్టర్స్ మధ్య చిక్కుకున్నప్పుడు ఎదురయ్యే కన్ఫ్యూజన్ వరకు రాకేష్ వర్రే మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక కమెడియన్ సత్య తనదైన టైమింగ్, పంచ్ డైలాగులతో నవ్వులు పంచేలా కనిపిస్తున్నారు.
ఈ సినిమాతో బెంగాలీ నటి మధుమిత సర్కార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఇందులో ఆమె ఆశ, రూప అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకే నటి రెండు పాత్రలు పోషించడం, ఆ రెండు పాత్రల మధ్య ఉండే భిన్నమైన మనస్తత్వాలు కథలో కీలకంగా మారనున్నాయి.
ఇక ట్రైలర్లో రొమాన్స్, కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య కృష్ణ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా ఉన్నాయి.
రాకేష్ వర్రే స్వయంగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. యెదు రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మొత్తానికి 'మాయ లేడీ' ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ సినిమాల మధ్య ఓ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు అనిపిస్తోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఆశ, రూపల మధ్య చిక్కుకున్న కృష్ణ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఈ ట్విన్ ట్విస్టులు ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: 'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?
[Maya Lady Trailer, Maya Lady Movie, Rakesh Varre, Madhumita Sarcar, Satya Comedy, Vishal Chandrashekhar, Prasankar, Telugu Movies 2026, Telugu Film News]






