
సినిమాకి ప్రమోషన్ అనేది ఎంతో ముఖ్యం. పైగా మైలురాయి సినిమా అంటే హీరోతో పాటు మూవీ టీమ్ చేసే హడావుడి అంతాఇంతా ఉండదు. అలాంటిది టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున మాత్రం.. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాని ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా చేసేస్తున్నారు.
ఈ మైలురాయి చిత్రాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు నాగార్జున పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం 'కింగ్ 100' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మనాలిలో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, షూటింగ్ లొకేషన్ నుండి వస్తున్న లీకులు అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన లీక్ తో సోషల్ మీడియాలో 'కింగ్ 100' గురించి తెగ చర్చ జరుగుతోంది.
మనాలిలో ఐశ్వర్య రాజేష్ సందడి
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై గత కొన్నాళ్లుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఒక హీరోయిన్ గా ఖరారైంది. ప్రస్తుతం మనాలిలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య రాజేష్ రివీల్ చేయడం విశేషం.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనాలికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఐశ్వర్య. అక్కడ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఇక దర్శకుడు రా. కార్తీక్‌తో ఆమె దిగిన సెల్ఫీలు కూడా అందులో ఉన్నాయి. ఈ ఫొటోలతో ఆమె 'కింగ్ 100' ప్రాజెక్ట్‌లో భాగమని స్పష్టమైంది. ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూవీ టీమ్ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వనప్పటికీ, ఐశ్వర్య సైలెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్డేట్ లీక్ చేసిందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
స్టైలిష్ లుక్‌లో కింగ్
మనాలి షెడ్యూల్ సందర్భంగా నాగార్జున లుక్ కూడా రివీల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు నాగ్ తో దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 66 ఏళ్ల వయసులో కూడా నాగార్జున ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపిస్తుండటం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున మూడు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం.

తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ తో పాటు సీనియర్ నటి టబు, సుస్మితా భట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నాగార్జున 100వ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో, అతి త్వరలోనే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.





