ఓటీటీలో ఈ మధ్యకాలంలో బెంగాలీ వెబ్ సిరీస్‌ల జోరు పెరుగుతోంది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్, సూపర్ నేచురల్ కథాంశాలతో రూపొందుతున్న సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన మరో బెంగాలీ వెబ్ సిరీస్ 'కౌరిబురి: ది కర్స్డ్ టెంపుల్'. సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. నవంబర్ 6 నుంచి తెలుగు ఆడియోతోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథాకథనాలు ఎలా ఉన్నాయి?
భవతారణ్ ముఖర్జీ (జీతూ కమల్)కు జ్యోతిష్యంతో పాటు కొన్ని మంత్రశక్తులు కూడా తెలుసు. భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలను ముందుగానే పసిగట్టగలడు. ఒకరోజు అతని తండ్రి అస్సాంలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మాధురి (సోలంకీ రాయ్) అనే యువతి గురించి చెబుతాడు. ఆమె ప్రమాదంలో ఉందని, వెళ్లి కాపాడాలని సూచిస్తాడు. గతంలో భవతారణ్, మాధురి ఒకే ప్రాంతంలో నివసించేవారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఆకర్షణ కూడా ఏర్పడుతుంది. తండ్రి మాట ప్రకారం భవతారణ్ అస్సాం అడవుల్లోని మాధురి ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆమెను ఏదో దుష్టశక్తి పీడిస్తోందని తెలుసుకుంటాడు. మాధురికి అనీర్ బన్‌తో వివాహం జరిగిందని, అతను ఏమయ్యాడో తెలియడం లేదని ఆమె తల్లిదండ్రులు చెబుతారు.
ఈ క్రమంలో భవతారణ్కు పరాఖ్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతని ద్వారా ఒక వృద్ధుడిని కలుస్తాడు. ఆ అడవిలోని భయంకరమైన గుహలో ఒక మాంత్రికురాలు కౌరిబురి దేవిని పూజిస్తుంటుందని, అక్కడ గోలోక్ పుష్పం అనే అద్భుతమైన పుష్పం ఉందని వృద్ధుడు చెబుతాడు. విషానికి విరుగుడుగా పనిచేసే ఆ పుష్పం మాధురిని కాపాడగలదని వివరిస్తాడు. అయితే దానిని సంపాదించడం అంత సులభం కాదని హెచ్చరిస్తాడు. అసలు ఆ మాంత్రికురాలు ఎవరు? ఆమె లక్ష్యం ఏమిటి? మాధురి భర్తకు ఏమైంది? భవతారణ్ ఆ మాయా పుష్పాన్ని సంపాదించి మాధురిని కాపాడగలిగాడా? అనేదే మిగతా కథ.
బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో సూపర్ నేచురల్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దట్టమైన అడవి, భయంకరమైన గుహ, క్షుద్రపూజలు, నరబలులు, మంత్రించిన కాకులు, రక్తస్పర్శతో వికసించే మాయా పుష్పం వంటి అంశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంత ఉత్కంఠను కలిగిస్తాయి. కౌరిబురి దేవి ఎవరు? మాంత్రికురాలి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇచ్చిన వివరణ కూడా కొంతవరకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలోని కొన్ని కీలకమైన అంశాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఇది కూడా చదవండి: 22 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు అదే పేరుతో కమల్‌హాసన్ కొత్త సినిమా.!
ఇక లోపాల విషయానికి వస్తే.. ఇలాంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథల్లో సాధారణంగా దుష్టశక్తుల వెనుక బలమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఈ సిరీస్‌లో మాంత్రికురాలి లక్ష్యం విషయంలో దర్శకుడు ఎంచుకున్న అంశం అంతగా ఆసక్తికరంగా అనిపించదు. మరోవైపు దుష్టశక్తులు ఆవహించిన వ్యక్తులు వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలు కూడా పెద్దగా కనిపించవు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి.
ప్రధాన పాత్రల్లో నటించిన జీతూ కమల్, సోలంకీ రాయ్ సహా మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఇలాంటి కథల్లో ప్రేక్షకులు ఆశించే స్థాయిలో క్లైమాక్స్‌ను రూపొందించలేకపోయారు. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటాన్ని మరింత ఉత్కంఠభరితంగా చూపించి ఉంటే బాగుండేది. మొత్తంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కథనం, క్లైమాక్స్ విషయంలో నిరాశ పరుస్తుంది ఈ 'కౌరిబురి: ది కర్స్డ్ టెంపుల్'.
మీకు నచ్చవచ్చు: సురేఖవాణి వైరల్ వీడియో.. అందులో ఉన్న మ్యాటర్‌పై అదిరిపోయే రిప్లై ఇచ్చేసింది
[Kauriburi The Cursed Temple Review, Kauriburi Web Series, Netflix New Series, Bengali Thriller Series, Kauriburi Telugu Review, Jeetu Kamal, Solanki Roy, Sayantan Ghosal, Netflix Telugu Dubbed Series]






