Home

»

Latest News

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు తృటిలో త‌ప్పిన ఘోర ప్ర‌మాదం.. ఆమె క‌ళ్ల ముందే ముగ్గురు మృతి.!

Nov 13, 2026 2:38PM

సినిమా షూటింగ్స్‌లో నటీనటులు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడితే, మరికొన్ని సంఘటనలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి భయంకరమైన అనుభవం తనకు ఎదురైందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ సమయంలో తాను తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని చెప్పారు. తన కళ్ల ముందే 100 అడుగుల భారీ క్రేన్ కూలిపోవడం, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనను పక్కకు లాగడంతో ప్రాణాలతో బయటపడటం గురించి ఆమె వివరించారు.

2020 ఫిబ్రవరిలో చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, లైటింగ్ ఏర్పాట్ల కోసం ఉపయోగిస్తున్న సుమారు 100 అడుగుల ఎత్తైన క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు అనే ముగ్గురు సినిమా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ కూడా అక్కడే ఉన్నారు.

తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ రోజు రాత్రి షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను 80 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించేందుకు ప్రోస్థెటిక్ మేకప్ వేసుకొని ఉన్నానని చెప్పారు. సాధారణంగా షూటింగ్ సమయంలో నటీనటులు మానిటర్ దగ్గర కూర్చుంటారు. ఆ రోజు కూడా తాను అక్కడే ఉన్నానని, ఒక్కసారిగా అందరూ పరుగులు తీయడం మొదలుపెట్టడంతో తాను కూడా ఏం జరుగుతుందో తెలియక పరుగెత్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి: ‘DNK’ మూవీ రివ్యూ

అలా పరుగెత్తుతున్న సమయంలో ఒక కన్సోల్ టేబుల్‌కు తగిలి కింద పడిపోయానని, అసలు అందరూ ఎందుకు పరుగెడుతున్నారో తెలుసుకోవడానికి వెనక్కి తిరిగి చూశానని కాజల్ తెలిపారు. అప్పుడే తన వైపుగా 100 అడుగుల భారీ క్రేన్ కూలిపోతుండటం కనిపించిందట. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా భయంతో స్తంభించిపోయానని చెప్పారు. అదే సమయంలో ఎవరో తనను బలంగా పక్కకు లాగారని, క్రేన్ తన పక్కనే పడిపోయిందని వెల్లడించారు.

ఆ తర్వాత తన స్టాఫ్ వచ్చి క్షేమంగా ఉన్నావా అని అడిగారని, తనను ఎవరు పక్కకు లాగారని వారిని అడిగానని కాజల్ చెప్పారు. అయితే తన స్టాఫ్‌లో ఎవరూ తన దగ్గర లేరని తెలిసిందట. అసలు ఆ సమయంలో తనను కాపాడింది ఎవరో ఇప్పటికీ తెలియదని, ఆ భగవంతుడే తనను కాపాడాడని నమ్ముతున్నానని చెప్పారు. ఈ సంఘటన తర్వాత చాలా రోజులు భయంతో పాటు ప్రాణాలతో బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నానని, జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని ఆమె వెల్లడించారు.

మీకు నచ్చవచ్చు:

కంగనా రనౌత్‌తో రవిబాబు ప్రయోగం.. హిందీలో తొలి సినిమా ఎనౌన్స్ చేసిన డైరెక్ట‌ర్‌.!

ఐశ్వర్యారాయ్ అందం చూసి పోటీ నుంచి త‌ప్పుకోవాల‌నుకున్న మిస్ యూనివ‌ర్స్‌.!

 

 

 

 

[KajalAggarwal, Indian2, KamalHaasan, Shankar, Indian2Accident]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com