నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుస్మితా శెట్టి, అలీ, రఘుబాబు, గుండు సుదర్శన్, రజిత, ప్రియ, భద్రం తదితరులు
సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం: శ్రీను కంభాల
విడుదల తేదీ: 13.11.2026
ఇటీవలికాలంలో వస్తున్న మాస్, యాక్షన్, అతి వయెలెన్స్ సినిమాల మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు, యూత్‌కి నచ్చే అంశాలతో కూడిన సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా కామెడీతోపాటు కొంత క్రైమ్‌ని కూడా మిక్స్ చేసి దొంగ నాకొడుకు(DNK) అనే డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మౌళి హీరోగా నటించాడు. ఇంతకుముందు అతను చేసిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండడంతో టాలీవుడ్‌లోనే పెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దాంతో సినిమాకి హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దొంగ నా కొడుకు తన కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడా? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం
కథ:
అతని పేరు ఈశ్వర్(మౌళి). చదువు, సంధ్య లేకుండా గాలికి తిరుగుతూ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకుంటూ వుంటాడు. దాంతో అతనికి అప్పులు పెరిగిపోతాయి. అతనికి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్ పెడుతుంటాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలుస్తుంది. అప్పటివరకు తన కూతురు దగ్గర 10 లక్షల వరకు ఈశ్వర్ తీసుకున్నాడని తేలుతుంది. ఆ డబ్బు కట్టమని అతని ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు ఆ అమ్మాయి తండ్రి. ఈ అప్పులు తీరాలంటే పెద్దదేదో చెయ్యాలని తన ఫ్రెండ్‌తో కలసి ప్లాన్ చేస్తాడు. ఆ ఊళ్లో ఫేమస్ అయిన గుండు బాస్ జ్యూయలరీలో దొంగతనానికి వెళతారు. అయితే అప్పటికే ఆ షాప్‌ను ఎవరో దోచేస్తారు. ఆ తర్వాత అనుకోకుండా వారికి ఒక పెద్ద బ్యాగ్ దొరుకుతుంది. అందులో ఆ షాప్‌లో దోచుకున్న బంగారం కనిపిస్తుంది. ఆ బంగారాన్ని అమ్మాలని ట్రై చేస్తారు. కానీ, అది రోల్డ్‌గోల్డ్ అని తేలుతుంది. అంతేకాదు, ఆ బ్యాగ్‌లో బంగారంతోపాటు మరో వస్తువును చూసి షాక్ అవుతారు. ఆ బ్యాగ్ ఎవరిది? అందులో రోల్డ్‌గోల్డ్ నగలను ఎవరు పెట్టారు? ఆ బ్యాగ్‌లో ఉన్న మరో వస్తువు ఏమిటి? ఆ బ్యాగ్ వల్ల ఈశ్వర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ గోల్డ్ షాప్‌లోని బంగారాన్ని దోచుకున్న అసలు దొంగ ఎవరు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇది అర్థం పర్థం లేని కథ, కథనం, డైలాగులతో రూపొందిన సినిమా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఆసక్తి కలిగించని విధంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఏమాత్రం నవ్వు తెప్పించని కామెడీ సీన్స్‌తో, డైలాగులతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. పైగా ఒక్కో సీన్‌ను వీలైనంత లాగి బోర్ కొట్టించే ప్రయత్నం చేశారు. అన్నింటినీ మించి సినిమాలో నటించిన నటీనటులంతా తమ ఓవర్ యాక్షన్‌తో ఇరిటేషన్ తెప్పించారు. అవసరానికి మించి, అనవసరం అనిపించే ఎన్నో ట్విస్టులతో సినిమాను పరిగెత్తించాలనుకున్నాడు డైరెక్టర్. కానీ, థియేటర్‌ని వదిలి ప్రేక్షకులు బయటికి పరిగెత్తేలా ఆ సీన్స్ వచ్చాయని సినిమా చూస్తున్నవారికి తెలుస్తుంది. అన్నింటినీ మించి గే కామెడీతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యాలనుకున్న డైరెక్టర్ ప్లాన్ ఫెయిల్ అయింది.
నటీనటులు:
హీరో దగ్గర నుంచి మిగతా నటీనటులంతా డైరెక్టర్ చెప్పినట్టు చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రతి ఆర్టిస్టుతో ఓవర్ యాక్షన్ చేయించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫలానా ఆర్టిస్టు బాగా చేశారని చెప్పడానికి ఈ సినిమాలో ఏమీ లేదు.
సాంకేతిక నిపుణులు:
కథ, కథనాలు ఎలా ఉన్నా సూర్య బాలాజీ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ను రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ లెంగ్త్ ఎక్కువ కావడం వల్ల ఆడియన్స్‌కి విసుగు అనిపిస్తుంది. సంగీత పరంగా సింజిత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పాటలుగానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గానీ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగానే ఉన్నాయి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు.. వీటిలో దేనిలోనూ ప్రత్యేకత కనిపించలేదు. సినిమాలో హడావిడి బాగా కనిపిస్తుంది కానీ, సబ్జెక్ట్‌లో అంత విషయం లేదు అనేది సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. సినిమా ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు థియేటర్‌లో నుంచి బయట పడదామా అని ప్రేక్షకుల్ని కంగారు పెట్టడంలో మాత్రం డైరెక్టర్ శ్రీను కంభాల సక్సెస్ అయ్యాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘దొంగ నాకొడుకు’ ట్రైలర్‌లో చెప్పినట్టుగానే ఇది MOST CHILLAR FILM OF THE YEAR.
రేటింగ్: 2/5
- జి.హరా
[DNKMovieReview, DongaNakoduku, TeluguMovieReview, MythriMovieMakers]





.webp)
