Home

»

Latest News

పూజా హెగ్డేకు ‘క్ష‌మాప‌ణ‌’ చెప్పిన ‘జననాయకుడు’ డైరెక్ట‌ర్.. ఏం జ‌రిగింది?

Jul 22, 2026 3:51PM

దళపతి విజయ్ అభిమానులు, సౌత్ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్'. జులై 23వ తేదీ గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ సినీ కెరీర్‌లో ఇది చివరి చిత్రం కావడమే కాకుండా, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ బజ్ నెలకొంది. అయితే, సినిమా విడుదల కాన్ డౌన్ ప్రారంభమైన వేళ ఈ చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించి అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన అనేక ముఖ్యమైన సన్నివేశాలను ఎడిటింగ్‌లో కట్ చేయాల్సి వచ్చిందని, అందుకే ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

గతంలో దళపతి విజయ్‌తో కలిసి 'బీస్ట్' సినిమాలో జోడీ కట్టిన పూజా హెగ్డే, మళ్లీ ఈ కాంబినేషన్‌లో 'జన నాయగన్' సినిమా ప్రకటించగానే ఎంతో సంతోషపడింది. ఇటీవలి కాలంలో సరైన సరైన బాక్సాఫీస్ విజయం లేక వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ బుట్టబొమ్మ, 'జన నాయగన్' చిత్రంపై కొండంత ఆశలు పెట్టుకుంది. విజయ్ చివరి సినిమా కావడం, ఈ సినిమా గ్యారెంటీ హిట్ కొడుతుందనే నమ్మకంతో తన కెరీర్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భావించింది. కానీ రిలీజ్ ముంగిట దర్శకుడు హెచ్. వినోద్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఆమె అభిమానులకు కాస్త నిరాశను మిగిల్చాయి.

అసలు ఈ సినిమా కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను కూడా దర్శకుడు వినోద్ బయటపెట్టారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి 'జన నాయగన్' రీమేక్ అనే ప్రచారాన్ని ఆయన అధికారికంగా అంగీకరించారు. అయితే తమిళ ప్రేక్షకుల అభిరుచికి, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో దాదాపు 50 శాతం మార్పులు చేర్పులు చేసినట్లు స్పష్టం చేశారు. మూల చిత్రం ఫస్టాఫ్ నుండి 60 శాతం, అలాగే రెండో భాగం సెకండాఫ్ నుండి 20 శాతం సన్నివేశాలను మాత్రమే స్వీకరించి, మిగిలిన కథను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు వివరించారు.

'భగవంత్ కేసరి' సినిమాలో కథానాయిక కాజల్ అగర్వాల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పాత్రలో కనిపిస్తే, 'జన నాయగన్' చిత్రంలో పూజా హెగ్డే పాత్రను ఒక పవర్‌ఫుల్ ప్రెస్ రిపోర్టర్‌గా తీర్చిదిద్దారట. అయితే ఈ సినిమాలో విజయ్ మరియు పూజా హెగ్డే మధ్య ఎటువంటి రొమాంటిక్ సన్నివేశాలు లేదా డ్యూయెట్లు ఉండవని వినోద్ తేల్చి చెప్పారు. స్క్రిప్ట్ రాసుకున్న ప్రాథమిక దశలో పూజా హెగ్డే పాత్రకు చాలా నిడివి మరియు ప్రాధాన్యత ఉండేదని, కానీ రన్ టైమ్ పరిమితుల కారణంగా ఆమెకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించలేకపోయామని, కొన్ని తీసిన సీన్లను కూడా కట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. కథాపరమైన పరిమితుల వల్ల ఒక మంచి నటికి తగినంత నిడివి ఇవ్వలేకపోయానని భావిస్తూ, ఈ విషయంలో పూజా హెగ్డేకు ప్రత్యేకంగా 'సారీ' చెబుతున్నానని వినోద్ తెలిపారు. రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు దర్శకుడు పేల్చిన ఈ బాంబ్ పూజా హెగ్డే అభిమానులను ఆవేదనకు గురిచేసినప్పటికీ, అతిథి తరహా పాత్రలోనే ఆమె ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

Jana Nayagan, Thalapathy Vijay, Pooja Hegde, Director H Vinoth, Bhagavanth Kesari 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com