మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఒకవైపు కలెక్షన్ల వర్షం కురుస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఈ చిత్రంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో 'పెద్ది' సినిమా పోస్ట్ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియా ట్రోలర్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమాలపై కావాలనే విషం చిమ్మే కొందరి తీరును ఆయన తప్పుపట్టారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని, సినిమా నచ్చితే మెచ్చుకోవడం, నచ్చకపోతే విమర్శించడం సహజమేనని.. కానీ కావాలనే ఒక సినిమాను దెబ్బతీయాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమందికి ఒక సినిమా ఫ్లాప్ అయితే వింత ఆనందం కలుగుతుందని, అది చాలా తప్పుడు ఆలోచన అని జగ్గూభాయ్ అన్నారు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం లేదా వ్యూస్ కోసం వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలను టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ రకమైన నెగిటివ్ ప్రచారం వెనుక పనిలేని వెదవలు, గుంటనక్కలు ఉన్నారంటూ ఆయన తనదైన శైలిలో ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఒక సినిమా వెనుక కేవలం హీరో మాత్రమే ఉండరని, నిర్మాత పెట్టిన పెట్టుబడితో పాటు దర్శకుడు, టెక్నీషియన్లు, వందలాది మంది కార్మికుల కష్టం దాగి ఉంటుందని జగపతి బాబు గుర్తుచేశారు. సినిమా ఫలితంపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయని, అలాంటి ప్రాజెక్ట్‌ను నాశనం చేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రామ్ చరణ్ ఆర్థికంగా ఎంతో బలంగా ఉండొచ్చు, కానీ మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా రివ్యూలు ఇవ్వడం వేరని, కానీ వ్యక్తిగత కక్షలతో లేదా ఉద్దేశపూర్వకంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వేరని జగ్గూభాయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జగపతి బాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలో చాలామంది ఆయన మాటలను సమర్థిస్తుండగా, నెటిజన్లు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా వివాదాలు, ట్రోలింగ్స్ ఎలా ఉన్నా 'పెద్ది' సినిమా థియేటర్లలో మాత్రం సాలిడ్ వసూళ్లతో అదరగొడుతోంది. రామ్ చరణ్ నటనకు, చిత్ర దర్శకుడి టేకింగ్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





