
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ప్రేమకథలు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ ఒకటి. 1989లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గానే ఉంది. ఇప్పుడు ఈ ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది.
నాగార్జున అభిమానులకు, మణిరత్నం సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్ చెబుతూ ‘గీతాంజలి’ రీరిలీజ్‌కు కొత్త తేదీ లాక్ అయింది. నవంబర్ 13న ఈ క్లాసిక్‌ను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. గతంలో రీరిలీజ్ ప్లాన్ చేసి వాయిదా వేయడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది.
నిజానికి ఈ ఏడాది ఆగస్టు 28న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘గీతాంజలి’ని 4K వెర్షన్‌లో రీరిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. అయితే ఆ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఇప్పుడు నవంబర్ 13న కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మరింత మెరుగైన పిక్చర్ క్వాలిటీ, రిచ్ కలర్స్, ఇంప్రూవ్డ్ సౌండ్‌తో 4K వెర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతాంజలి’లో నాగార్జున, గిరిజ జంటగా నటించారు. అనారోగ్యంతో పోరాడుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టే ప్రేమను ఎంతో కవితాత్మకంగా మణిరత్నం తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది.
సినిమాకు మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ‘ఓ ప్రియా ప్రియా’, ‘జల్లంత కవ్వింత’, ‘ఆమని పాడవే హాయిగా’ వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్‌కు ఫేవరెట్‌గానే ఉన్నాయి. 4K రీరిలీజ్‌తో ఈ పాటలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం దక్కనుంది.
మొత్తానికి దాదాపు 37 ఏళ్ల తర్వాత కూడా ‘గీతాంజలి’పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పటి ప్రేక్షకులకు నాస్టాల్జియాను గుర్తు చేయడంతో పాటు.. కొత్త తరానికి ఈ క్లాసిక్ లవ్‌స్టోరీని బిగ్ స్క్రీన్‌పై చూపించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చదవండి: చిన్నప్పటి ‘చిట్టి నాయుడు’.. ఇప్పుడు రియల్ లైఫ్ డాక్టర్.!
[Geethanjali Movie Re Release Date, Geethanjali Re Release, Geethanjali 4K Release, Geethanjali Movie, Akkineni Nagarjuna, Maniratnam Telugu Movie, Telugu Love Stories, Telugu Film News]






