
సినిమా షూటింగ్లలో నటీనటులకు ఎదురయ్యే ప్రమాదాలు అప్పుడప్పుడు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ముఖ్యంగా సముద్రం, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో చిత్రీకరణ అంటే మరింత జాగ్రత్త అవసరం. అలాంటి ఓ భయానక అనుభవాన్ని అక్కినేని అమల ఎదుర్కొన్నారట. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఏకంగా సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారట. అయితే అక్కడే ఉన్న మత్స్యకారులు సమయానికి స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఘటనను స్వయంగా ఆ సినిమా దర్శకుడు గుర్తుచేసుకున్నారు.
మోహన్‌లాల్, అమల అక్కినేని, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఉల్లడక్కం’. 1991లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమల ‘రేష్మ’ అనే మానసిక సమస్యతో బాధపడే యువతి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి దర్శకుడు కమల్ తాజాగా ‘వనిత’ మ్యాగజైన్లో తన కాలమ్ ద్వారా వెల్లడించారు.
‘ఉల్లడక్కం’ కథ ప్రకారం.. రేష్మ ప్రియుడు సముద్రంలో పడిపోయే ఓ కీలకమైన ఎమోషనల్ సీన్‌ను చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే ఆ రోజు సముద్రంలో అలలు చాలా ఉధృతంగా ఉన్నాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు ముందుగానే చిత్రబృందాన్ని హెచ్చరించారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే రక్షించేందుకు వారు కూడా నీళ్లలో సిద్ధంగా ఉన్నారు.

ఆ సీన్ కోసం అమల తన పాత్రలో పూర్తిగా లీనమై సముద్రం వైపు చూస్తూ నిలబడ్డారు. ఆమె నటనలోని తీవ్రతను గమనించిన దర్శకుడు కమల్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ తర్వాత కెమెరా ఆన్ చేసి ‘యాక్షన్’ చెప్పగానే.. ఒక్కసారిగా భారీ అల వచ్చి అక్కడున్న వారిని ముంచెత్తింది. ఆ అల ధాటికి అమలతో పాటు కెమెరా కూడా సముద్రంలోకి కొట్టుకుపోయాయి. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో చిత్రబృందం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఇది కూడా చదవండి: వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
అక్కడే అప్రమత్తంగా ఉన్న మత్స్యకారులు వెంటనే నీళ్లలోకి దూకి అమలను రక్షించారు. ప్రాణాలకు తెగించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. మరోవైపు సముద్రంలో మునిగిపోతున్న కెమెరాను కాపాడేందుకు కెమెరా అసిస్టెంట్ కూడా తీవ్రంగా ప్రయత్నించారు. తన సొంత బిడ్డను కాపాడుకున్నట్లుగా ఆ కెమెరాను నీళ్లపైకి ఎత్తి పట్టుకున్నారని దర్శకుడు కమల్ గుర్తుచేసుకున్నారు. వెంటనే యూనిట్ సభ్యులు స్పందించి అతడిని, కెమెరాను బయటకు తీసుకొచ్చారు. అమల ప్రాణాలతో బయటపడటం దేవుడి దయేనని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రమాదం మాత్రమే కాదు.. ‘ఉల్లడక్కం’ షూటింగ్లో అమల నటనకు సంబంధించిన మరో విషయాన్ని కూడా దర్శకుడు పంచుకున్నారు. మానసిక వైద్యశాలలో డాక్టర్ ముందు నటించే సన్నివేశంలో ఆమె అద్భుతంగా నటించారని, సెట్లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారని తెలిపారు. ‘కట్’ చెప్పిన తర్వాత కూడా ఆమె ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేదని అమల అంకితభావాన్ని ప్రశంసించారు.
మోహన్‌లాల్‌కు ఉత్తమ నటుడిగా, దర్శకుడు కమల్‌కు ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర అవార్డులు అందించిన చిత్రంగా ‘ఉల్లడక్కం’ నిలిచింది. మూడు దశాబ్దాలకు పైగా గడిచినా ఈ సినిమా షూటింగ్లో జరిగిన భయానక ఘటన మాత్రం దర్శకుడి జ్ఞాపకాల్లో అలాగే ఉండిపోయింది. అమల ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు:
బాలయ్య నన్ను ‘ఏరా పెద్దిరెడ్డి’ అని పిలుస్తారు.. ‘దాదా’ సినిమా ఎలా ఉండబోతుందంటే.?
అలియాస్ రుక్మిణి: మూడు నెలల్లో సినిమా పూర్తి.. మామూలు స్పీడ్ కాదు.!
[Amala Near Death Experience, Amala Akkineni Shooting Accident, Ulladakkam Movie Amala Incident, Ulladakkam Movie, Amala Akkineni, Director Kamal, Mohanlal, Telugu News]





