కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పార్ట్-1 ఘనవిజయం సాధించడంతో, అందరి దృష్టి ఇప్పుడు ‘దేవర 2’పై పడింది. అయితే, తాజాగా ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో కొరటాల శివ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్స్ మారడం దేవర సీక్వెల్‌పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా విడుదల తేదీని 2027 జూన్ 11గా చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అంటే వచ్చే ఏడాది పొడవునా తారక్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కే తన సమయాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో దేవర-2 పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే, ఖాళీగా ఉండటం ఇష్టం లేని కొరటాల శివ, ఈ విరామంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు లైన్ వినిపించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగిపోయాయని సమాచారం. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలతో మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా పండించే కొరటాల, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పొలిటికల్ లేదా సోషల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు దేవర సీక్వెల్ ఆలస్యం కావడంతో, బాలయ్య-కొరటాల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ టేకింగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
మరోవైపు, మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సీక్వెల్‌పై లేదా ఆయన తదుపరి చిత్రాలపై ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తారక్ చేయబోయే 'గాడ్ ఆఫ్ వార్' సినిమా అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ తారక్ ఇతర సినిమాలతో బిజీగా ఉంటే, కొరటాల శివ తన పూర్తి ఫోకస్‌ను బాలయ్య సినిమాపైనే పెట్టనున్నారు.




