Home

»

Featured News

రోజుకు రూ.30 సంపాదన నుంచి నేషనల్ అవార్డు వరకు.. తమన్ జీవితంలో ఎన్ని కష్టాలో తెలుసా?

Nov 16, 2026 10:27AM

(నవంబర్ 16 ఎస్.ఎస్.తమన్ పుట్టినరోజు సందర్భంగా..)

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన సంగీతం అందించిన సినిమా నుంచి పాటలు విడుదలవుతున్నాయంటే చాలు.. వాటిలో ఏదో ఒకటి చార్ట్‌బస్టర్‌గా నిలవాల్సిందే. ముఖ్యంగా మాస్ బీట్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో తమన్ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. నవంబర్ 16న ఆయన పుట్టినరోజు సందర్భంగా సంగీత ప్రపంచంలోకి ఆయన ఎలా వచ్చారు? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఆయన అందించిన మధురమైన పాటలు ఏమిటి? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. ఆయనది సంగీత కుటుంబం. తాత ఘంటసాల బలరామయ్య ప్రముఖ దర్శక నిర్మాత కాగా.. తండ్రి ఘంటసాల శివకుమార్ మంచి డ్రమ్స్ ప్లేయర్. వందలాది సినిమాలకు ఆయన డ్రమ్స్ వాయించారు. తల్లి ఘంటసాల సావిత్రి, సోదరి యామిని ఘంటసాల, పిన్ని వసంత కూడా గాయనీమణులే. ఇలా ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచే తమన్‌కు డ్రమ్స్‌పై ఆసక్తి ఏర్పడింది. అయితే ఆయనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే గుండెపోటుతో తండ్రి మరణించారు. ఆ సంఘటన కుటుంబాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. తండ్రి మరణంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకున్న తమన్.. సంగీతాన్నే తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు.

తొమ్మిదేళ్ల వయసులోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి రిథమ్ ప్యాడ్స్ వాయించే అవకాశం తమన్‌కు వచ్చింది. ఆ తర్వాత డ్రమ్స్ ప్లేయర్‌గా పలు సంగీత బృందాలతో కలిసి పనిచేశారు. రాజ్-కోటి, ఎం.ఎం. కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద పనిచేసిన ఆయన.. ముఖ్యంగా మణిశర్మ దగ్గర దాదాపు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. మహేశ్ బాబు ‘ఒక్కడు’ నుంచి ప్రభాస్ ‘బిల్లా’ వరకు మణిశర్మ సంగీతం అందించిన అనేక సినిమాల్లో తమన్ భాగమయ్యారు. దాదాపు 94 సినిమాలకు ఆయనతో కలిసి పనిచేస్తూ సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారు. మరోవైపు ఏఆర్ రెహమాన్ దగ్గర కూడా పనిచేసిన అనుభవం ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమాలో నటుడిగా కనిపించిన తమన్.. ఆ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

సంగీత దర్శకుడిగా మారాలన్నది తమన్ చిన్ననాటి కల. 25 ఏళ్ల వయసులోనే ఆ కలను నెరవేర్చుకున్నారు. తమిళంలో ‘మాస్కోవిన్ కావేరి’ ఆయన మొదట సంగీతం అందించిన చిత్రంగా నిలవగా, తెలుగులో ‘మళ్లీ మళ్లీ’, ‘కిక్’ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘నాయక్’, ‘బాద్‌షా’, ‘బృందావనం’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’, ‘వకీల్ సాబ్’, ‘అఖండ’, ‘భీమ్లా నాయక్’, ‘గుంటూరు కారం’, ‘ఓజీ’ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తూ వందకు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఇక తమన్ సంగీతం అందించిన పాటల్లో ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’, ‘కుర్చీని మడతపెట్టి’, ‘టిల్లు అన్నా డీజే పెడితే’, ‘సినిమా చూపిత్త మామా’ , ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’  వంటి పాటలు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందాయి. మాస్ పాటలతో పాటు ‘సామజవరగమన’ తరహా మెలోడీలతోనూ తనలోని మరో కోణాన్ని చూపించారు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అందించిన సంగీతానికి 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ సంగీత ద‌ర్శ‌కుడిగా పురస్కారం అందుకున్నారు. ‘బుట్టబొమ్మ’ పాట దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో తమన్ పేరు మరింతగా మార్మోగిపోయింది.

ఒకప్పుడు డ్రమ్స్ ప్లేయర్‌గా రోజుకు కేవలం రూ.30 పారితోషికం అందుకున్న తమన్.. ఆ తర్వాత కీబోర్డ్ ప్లేయర్‌గా, సంగీత దర్శకుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన భార్య శ్రీ వర్ధిని కూడా గాయని. కుమారుడు అచ్యుత్ సంగీతంపై ఆసక్తి చూపిస్తుంటాడని తమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వందలాది పాటలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, డ్రమ్స్ ప్లేయర్‌గా మొదలైన ఆయన ప్రయాణం జాతీయ అవార్డు అందుకునే స్థాయికి చేరడం అంద‌రికీ స్ఫూర్తిదాయకం.

 

 

 

[ThamanBirthday, ThamanBiography, ThamanBestSongs, NationalAward, ThamanSuccessStory]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com