
1951 మార్చి 15న ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్ 1951 మే 17న విడుదలైంది. మొదటి మూడు వారాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ప్రింట్లు పెరిగాయి, థియేటర్లు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘పాతాళభైరవి’ కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన తొలి సినిమా ఇదే.
ఎన్టీఆర్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా 75 ఏళ్ల క్రితమే రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమాగా, 200 రోజులు ప్రదర్శింపడిన తొలి చిత్రంగా, ‘పాతాళభైరవి’ రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది.. ఆరోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు విజయ సంస్థలో నెలవారీ జీతానికి పనిచేసేవారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు విజయ అధినేతలు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ ప్రొడక్షన్స్ సంస్థను మరింత విస్తరించారు.





