ప్రత్యర్థులే అచ్చెరువోందే బాబు దార్శనికత: అమరావతి ఓఆర్ఆర్ తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం.!
Publish Date:Oct 22, 2026
Advertisement
ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్టం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో అమరావతి నగర నిర్మాణాలు చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. అమరావతిని కొందరు భ్రమరావతి అన్నారు. గ్రాఫిక్స్ అన్నారు. అయితే చివరకు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి అద్భత నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఏ నగరానికైనా అత్యంత కీలకమైన కనెక్టివిటీ విషయంలో చంద్రబాబు ముందు చూపు అమరావతిని ఒక బృహత్తర నగరంగా రూపుదాల్చేలా చేస్తున్నది. అందులో భాగంగానే అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. రాజధాని ప్రాంత రూపురేక లను మార్చేసే బృహత్తర ప్రాజెక్టుగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న ఈ ఓఆర్ఆర్ నిర్మాణం.. సమీప జిల్లాల ఆర్థికప్రగతిని మరో లేవెన్ కు తీసుకెడుతుంది. రాజధాని పరిధిలోని రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాఓఆర్ఆర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు నమూనా ప్రకారం ప్రధాన రింగ్ రోడ్డు నిడివి 189.93 కిలోమీటర్లుగా, దానికి అదనంగా నారాకోడూరు ప్రాంతం నుంచి బుడంపాడు వరకు ఉండే 5.2 కిలోమీటర్ల అనుసంధాన రహదారిని జోడించారు. దీంతో ఈ రహదారి మొత్తం పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుకుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ ఐదు జిల్లాల్లో ఉన్న 23 మండలాల పరిధిలోని 97 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది. పనుల పరిమాణాన్ని బట్టి, గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో దీని నిర్మాణం పూర్తికి 1,095 రోజుల నిర్దుష్ట సమయాన్ని నిర్దేశించారు. ప్రాజెక్టు వేగవంతంగా సాగడానికి, నిర్మాణ వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. సుమారు 189.93 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన రహదారి నిర్మాణానికి రోజుకు సగటున 173 మీటర్ల మేర పనులు పూర్తికావాల్సి ఉంటుంది. వాతావరణ మార్పులు, వర్షాకాలం, ఇతర సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుంటే పనుల వేగం మరింత పెంచాలని నిర్ణయించారు. అందుకే ఒకే సమయంలో నాలుగు ప్యాకేజీలలో పనులు ప్రారంభించేలా ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మార్గం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా రూపొందుతోంది. నిర్ణీత పాయింట్ల వద్ద మాత్రమే వాహనాలు రహదారిపైకి రావడానికీ పోవడానికీ వీలుగా ప్రత్యేక ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 100 కిలోమీటర్ల డిజైన్ స్పీడ్ తో ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నిస్సందేహంగా ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో కృష్ణా నదిపై రెండు వంతెనలు రానున్నాయి. వీటి మొత్తం పొడవు 8.2 కిలోమీటర్లు కాగా, అందులో ఒకటి 2.90 కిలోమీటర్లు, మరొకటి 5.30 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా 4.98 కిలోమీటర్ల పొడవునా మూడు సొరంగ మార్గాలు, 20 పెద్ద, 95 చిన్న వంతెనలు, 105 అండర్‌పాస్‌లు, 8 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం కానున్నాయి. మొత్తం 6 జాతీయ రహదారులు, 7 రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తూ, 34 ప్రదేశాల్లో హైవోల్టేజ్ విద్యుత్ లైన్లను దాటుకుంటూ ఈ రహదారి సాగుతుంది. ఈ భారీ ప్రాజెక్టు విస్తరణ కోసం దాదాపు 8,000 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక గెజిట్ ప్రకటన ఇప్పటికే పూర్తయింది. నిర్మాణ వ్యయం పరంగా నాలుగు ప్యాకేజీల కాంట్రాక్టు విలువ 11 వేల537 కోట్ల రూపాయలు. భూసేకరణ, సహాయ పునరావాస చర్యలతో కలిపి ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం .30 వేల491 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్‌ఏఐ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో నిర్వహిస్తోంది. దీని ప్రకారం నిర్మాణ సమయంలో ప్రభుత్వం 40 శాతం మేర నిధులను దశలవారీగా విడుదల చేస్తుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని సంబంధిత నిర్మాణ సంస్థ సొంతంగా సమకూర్చుకోవాలి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో కలిపి 10 నుంచి 15 ఏళ్ల వ్యవధిలో వాయిదాల రూపంలో కాంట్రాక్టరుకు చెల్లిస్తుంది. ఇటీవల అక్టోబర్ 2న టెండర్ ప్రకటన వెలువడగా, బిడ్లు దాఖలు చేయడానికి నవంబర్ 18 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 19న సాంకేతిక బిడ్లను పరిశీలించనున్నారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఆయా పరిసర ప్రాంతాల్లోని 97 గ్రామాల రూపురేకలు పూర్తిగా మారనున్నాయి. ఆ గ్రామాలలో భూముల విలువల పెరుగుదల, మెరుగైన రవాణా సదుపాయాలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అభించనున్నాయి మూడేళ్ల నిర్ణీత వ్యవధిలో ఈ రహదారి పూర్తికావడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరుకు రవాణా వేగవంతమవ్వడమే కాకుండా, రాజధాని ప్రాంతానికి వివిధ జిల్లాల నుండి కనెక్టివిటీ అనూహ్యంగా, అమోఘంగా మెరుగుపడుతుంది. [Amaravati Outer Ring Road CBN Vision, Amaravati ORR Tenders, NHAI Amaravati Project, Andhra Pradesh Infrastructure, Telugu One]
http://www.teluguone.com/news/content/amaravati-outer-ring-road-cbn-vision-43-235003.html





