చెవిరెడ్డి సహా ఆయన కుమారుల అరెస్టు: తిరుపతిలో హైటెన్షన్.!
Publish Date:Oct 22, 2026
Advertisement
తిరుపతిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రగడ సృష్టించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల తొలి రోజు రాయలసీమ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నామినేషన్ల దాఖలులో అక్రమాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి మరియు పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను సమీక్షించారు. గంగినేని చెరువు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరిని గుర్తించిన పోలీసులు, వారిని జిల్లా సరిహద్దుల వైపు తరలించారు. అదే సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో వైసీపీ అభ్యర్థికి చెందిన మోటార్ సైకిల్‌ను కొందరు దగ్ధం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌కు వెళ్తున్న అభ్యర్థిని అడ్డుకుని బైక్‌కు నిప్పు పెట్టారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల సహకారంతోనే వైపీపీ నాయకులు, అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నడుమ తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతొ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. [Chevireddy Bhaskar Reddy Arrest, Tirupati Collectorate Protest, Chandragiri Politics, ZPTC MPTC Nominations, AP politics, Chevireddy Mohith Reddy, Telugu One]
http://www.teluguone.com/news/content/chevireddy-bhaskar-reddy-arrest-43-235008.html





