ఫంక్షన్లకోసం వేలాదిరూపాయలు పెట్టి బట్టలు కొనలేకపోతున్నారా? ఇదిగో అద్దెకు తెచ్చుకోండిలా..

దుస్తులు మనిషి దర్పాన్ని ప్రదర్శిస్తాయి. ఏదైనా ఫంక్షన్, పెళ్ళి, బర్త్ డే, రిసెప్షన్ ఇలా వేడుకలు ఏవైనా సరే ఆహ్వానం అందితే అక్కడికి వెళ్లాల్సి వస్తే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెలిగిపోవాలని అనుకుంటారు మహిళలు. ప్రతి ఫంక్షన్ లో కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ప్రతి చోటుకు కొత్త దుస్తులు వేసుకుని వెళ్ళాలన్నా, కొత్త బట్టలు కొనాలన్నా కుదిరేపని కాదు. వేసుకున్నవే రిపీటెడ్ గా మార్చి మార్చి వేసుకోవాల్సి  వస్తుంది. అటు కొత్తవి కొనలేక, ఇటు  కొత్తగా కనిపించలేక ముఖం చిన్నబుచ్చుకునే చిన్నమ్మలు ఎందరో.. అయితే ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. ఫంక్షన్లు అయినా ఇతర వేడుకలు ఏవైనా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి బట్టలు కొనాల్సిన పని లేదు. జస్ట్ అద్దెకు తెచ్చుకోవచ్చు. ఫంక్షన్ జరిగినంతసేపు ధరించవచ్చు. వాటిని మళ్లీ తిరిగి ఇచ్చేయచ్చు. నచ్చిన దుస్తులు, నచ్చిన రంగులు, సాదాసీదాగా కాదు సెలబ్రిటీ రేంజ్ దుస్తులు తెచ్చుకోవచ్చు. ఇవి కూడా ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు. ఇదేదో బాగుందే అనిపిస్తోందా? అయితే ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి మరి..

ట్రెండ్ ఫాలో కావాలన్నా, ఫ్యాషన్ గా కనిపించాలన్నా కొత్త దుస్తులు కొనాలి. అయితే కొత్త దుస్తులు కొనాలంటే మాట కాదు. ఇలాంటి వారి కోసం కొన్ని ఆన్లైన్ సైట్లు గ్రాండ్ గా ఉన్న దుస్తులను అద్దెకిస్తున్నాయ్. వీటిని ధరించి సెలబ్రిటీలా వెలిగిపోవచ్చు.

ఫ్లై రోబ్ వెబ్సైట్..

ఫ్లై రోబ్ అనేది భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ రెంటల్ స్టోర్.  ఇందులో దుస్తులను ప్రముఖులు కూడా ఉపయోగించడం విశేషం. ఈ ముంబై ఆధారిత సేవ మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, ఇతర మెట్రో నగరాలకు కూడా దాని సేవలు   విస్తరించింది.   బట్టలు, నగలు  నుండి బ్యాగ్‌లు,  బూట్ల వరకు అద్దెకు లభిస్తాయి. అది ఆఫీసు పార్టీ అయినా, సూట్ అయినా, ఫార్మల్ వేర్ అయినా, డేట్ నైట్ కోసం వేసుకునే డ్రెస్ అయినా, సంగీత్ అయినా లేదా మెహందీ అయినా, డిజైనర్ దుస్తులు లేదా కోచర్, రన్‌వే, లేదా బోటిక్ కలెక్షన్‌లు  ఇలా మొత్తం ఫ్లై రోబ్‌లో ఉన్నాయి. ఇందులో అద్దెకు తీసుకోవాలని అనుకుంటే వారు  కొలతలు తీసుకోవడానికి ఒక ప్రొఫెషనల్‌ని పంపుతారు.  దుస్తులు  సరిపోయేలా మారుస్తారు.  వీటిని  కొన్ని రోజులు ఉంచుకోవచ్చు  సమయం పూర్తైన తర్వాత  పికప్ సర్వీస్  కూడా ఉంది.

స్విస్ లిస్ట్

స్విష్‌లిస్ట్ ఒక అద్బుతమైన సర్వీస్. ఇందులో డ్రీమ్ అనుకోగలిగిన దుస్తులన్నీ ఉంటాయి. వీటిని ఇంటి వద్దకే డెలివరీ చేయడం, ఇంటి గుమ్మం నుండి మళ్లీ పికప్ చేసుకుంటారు. ఇందులో రాబోయే  వేడుకల కోసం ముందుగానే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని విష్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఆ తరువాత సమయం వచ్చినప్పుడు దాన్ని అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు.  అన్ని రకాల వేడుకలకు తగిన దుస్తులు ఇందులో ఉంటాయి.

ర్యాప్డ్..

Wrapd సుమారు ఆరు సంవత్సరాల క్రితం బట్టలు అద్దెకు ఇచ్చే  ఆలోచనను ప్రారంభించారు.  కానీ ఆ సమయంలో ఈ  ఆలోచన  వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు అసంబద్ధంగా  ఆలోచనలేనిదిగా,  ఆచరణాత్మకమైనది  కాదని  అనిపించింది. చాలా మంది దానిని అప్పటికి అంగీకరించలేదు,దీంతో ఇది ఆఫ్ లైన్ స్టోర్ లా ఏర్పడింది.  తరువాత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది.   దాని పేరును మార్చింది. ఢిల్లీలోని పెద్ద స్టోర్‌లకు వెళ్లడం నుండి జైపూర్,  హైదరాబాద్‌లకు బ్రాంచ్ చేయడం వరకు  పెద్ద ఆన్‌లైన్ కస్టమర్ బేస్‌ను నిర్మిస్తూ ర్యాప్డ్ చాలా విస్తరించింది. Wrapd ప్రధానంగా వివాహాలు, పెళ్లి కార్యక్రమాలకు , అందులో  పాల్గొనాలనుకునే వారికి దుస్తులను అద్దెకు ఇస్తుంది. మొదటగా ఎంచుకున్న డ్రెస్ నచ్చకపోతే 48గంటల్లోపు వేరేవాటిని మార్చుకోవచ్చు.

లిబరెంట్

ప్లస్ సైజ్, ప్రెగ్నెన్సీ, పెటైట్  ఇలా ఏదైనా, లిబరెంట్ మహిళలను, వారికున్న బోలెడు అవసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రతి కేటగిరీలో  ఎంచుకున్న దుస్తులతో ఇది అన్నింటినీ అందిస్తుంది.  ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కోసం A-లైన్ డ్రెస్, లేదా సంగీత్ కోసం గౌను లేదా పెళ్లికి లెహంగా కావాలంటే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న కలెక్షన్‌తో డిజైనర్ వేర్‌లను అద్దెకు ఇవ్వడంలో Liberent దూసుకుపోతోంది.  భారతదేశంలోని అన్ని ప్రధాన మెట్రోలలో  ఇది ఏర్పాటుచేయబడింది.

స్టేజ్ 3 ..

స్టేజ్ 3 అనేది ఏ వెబ్సైట్ ఇవ్వలేని అత్యుత్తమ సేవ.  ఇది మార్కెట్‌లో అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించబడింది.  ప్రముఖ ప్యాషన్ డిజైనర్లు  సబ్యసాచి ముఖర్జీ, అంజు మోడీ, మనీష్ మల్హోత్రా, రిధి మెహ్రా వంటి ఫ్యాషన్  పరిశ్రమలోని వారు డిజైన్ చేసిన దుస్తుల మీద ఆసక్తి ఉంటే  అందుకు  స్టేజ్ 3కి మంచి వేదిక. డిజైనర్ దుస్తులను అద్దెకు ఇవ్వడం నుండి సెలబ్రిటీల రూపాన్ని ప్రతిబింబించే వరకు, ఇది అందరికీ  అందుబాటులో ఉంటుంది.

                                                             *నిశ్శబ్ద.