Home

»

Exclusive Movie News

'సూర్యవంశం' హార్ట్ టచింగ్ సీన్: కొడుకు ప్రేమ.. తండ్రి కోపం.. వెంకటేష్ నటనకి కంటతడి పెట్టాల్సిందే.!

Aug 17, 2026 3:14PM

తెలుగు సినిమా చరిత్రలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాణం పోసిన క్లాసిక్ సినిమాల్లో 'సూర్యవంశం' ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయంలో మెప్పించిన ఈ చిత్రం విడుదలైన ఇన్నేళ్లయినా ఇప్పటికీ బుల్లితెరపై వచ్చిందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. తండ్రీకొడుకుల అనుబంధం, ఆత్మాభిమానం, కష్టపడే తత్వం కలబోతగా వచ్చిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది.

ముఖ్యంగా తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ ద్వేషాన్ని భరిస్తూనే, ఆయనపై కొడుకు భానుప్రసాద్ చూపే అపరిమితమైన ప్రేమ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తండ్రి పుట్టినరోజున భానుప్రసాద్ తన ఆరాధనను చాటుకునే సన్నివేశం ప్రేక్షకుల కళ్లను చెమ్మగిల్చేలా చేస్తుంది. సొంత ఇంట అందరూ వేడుక చేసుకుంటుంటే, ఆ వేడుకకు దూరంగా ఉండే కొడుకు పడే వేదన ఈ దృశ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.

తండ్రి పుట్టినరోజు సందర్భంగా భానుప్రసాద్ గుడిలో నాన్నగారి పేరు మీద ప్రత్యేకంగా అర్చన చేయించి దేవుడి ప్రసాదాన్ని తీసుకొస్తాడు. అదే సమయంలో హరిశ్చంద్ర ప్రసాద్ తన మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగబోతుంటాడు. కెమెరామ్యాన్ ఫ్లాష్ పని చేయడం లేదని, అది సరిచేస్తుండగా.. తన తల్లి(రాధిక)ను పక్కకు పిలిచి, భానుప్రసాద్ ప్రసాదం ఇస్తాడు. "నాన్నగారి పేరు మీద గుడిలో అర్చన చేయించాను, ఈ ప్రసాదం ఆయనకు ఇవ్వమ్మా" అంటూ వెంకటేష్ చెప్పే మాటలు, ఆ సన్నివేశంలో ఆయన పండించిన ఎమోషన్స్ ఎంతో బావోద్వేగానికి గురిచేస్తాయి.

పాలేరు అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాడని తల్లి అబద్దం చెప్పగా.. తండ్రి ఆ ప్రసాదం తినబోతాడు. సరిగ్గా తినబోయే సమయంలో కాస్త దూరంలో నిల్చొని ఉన్న భానుప్రసాద్ కనిపించడంతో.. అది కొడుకు తెచ్చిన ప్రసాదం అని అర్థమై తినకుండా వెనక్కి ఇచ్చేస్తాడు. 

ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి గ్రూప్ ఫోటో దిగే సమయంలో భానుప్రసాద్ అక్కడ నిలబడి చూసే విధానం, తండ్రి తనను కుటుంబంలో ఒకడిగా గుర్తించకపోవడంపై అనుభవించే మానసిక వేదన అద్భుతంగా తెరకెక్కించారు. 

కెమెరామ్యాన్ ఫోటో తీయబోతూ, "అయ్యా అందరూ వచ్చినట్టేగా" అని అడిగినప్పుడు, తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ గంభీరంగా స్పందిస్తూ "నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు, త్వరగా ఫోటో తీయండి" అని చెప్తాడు. కనీసం కుటుంబ ఫోటోలో కూడా తనకు చోటు లేకపోయినా, తండ్రి క్షేమమే కోరుకునే భానుప్రసాద్ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించిన తీరు అద్భుతం. ఈ సన్నివేశంలో వెంకటేష్ నటన, ముఖంలో కనిపించే భావాలు ప్రతి ఒక్కరిచేత కన్నీళ్లు పెట్టిస్తాయి.

విక్టరీ వెంకటేష్ నటనకు, ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం తోడవడంతో ఈ సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్గ్రీన్ హార్ట్ టచింగ్ సన్నివేశాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

 

 

Venkatesh, Suryavamsam Movie, Emotional Scene

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com