Home

»

Exclusive Movie News

ఇండస్ట్రీని నాశనం చేశారు.. సినిమాలు చూడటమే మానేశా.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.!

Jul 16, 2026 11:11AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగువన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో తన సుదీర్ఘ అనుభవాలను పంచుకుంటూనే నేటి పరిశ్రమలోని లోపాలను కడిగిపారేశారు. చిత్ర పరిశ్రమకు దాదాపు 85 నుండి 90 ఏళ్ల వయస్సు ఉంటే, అందులో సుమారు 75 నుండి 80 సంవత్సరాల పాటు తమ కుటుంబం సినిమా రంగంతోనే ముడిపడి ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో ఎంతోమంది పెద్ద సూపర్ స్టార్లతో సినిమాలు తీసి భారీగా పేరు సంపాదించుకున్నామే తప్ప, ఆశించిన స్థాయిలో డబ్బు సంపాదించలేకపోయామని ఆయన ఓపెన్ గా అంగీకరించారు.

ప్రస్తుతం థియేటర్లలో టికెట్ల ధరలు, సినిమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంపై తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకప్పుడు మార్నింగ్ షో, మ్యాట్నీ అంటూ వరుసగా రోజుకు రెండు సినిమాలు థియేటర్లలో చూసి ఇంటికి వచ్చేవాడినని, కానీ ఇప్పుడు థియేటర్లలో సినిమాలు చూడటమే పూర్తిగా మానేశానని ఆయన సంచలన నిజం చెప్పారు. అందుకు ప్రధాన కారణం సాధారణ సామాన్యుడిలాగే తనకు కూడా విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడమేనని తేల్చి చెప్పారు. నిర్మాతలు తమ సినిమా పెట్టుబడిలో ఏకంగా 80 శాతం రికవరీని ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్-థియేట్రికల్ మార్గాల ద్వారా ముందే పొందుతున్నప్పుడు, మళ్లీ థియేటర్ల వద్ద టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను హింసించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

ఓటీటీల ప్రభావంపై మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీల వల్లే చిత్ర పరిశ్రమ పూర్తిగా నాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓటీటీ సంస్థల అంతర్గత సమావేశంలో ఒక కీలకమైన బాటా రేట్ల ఒప్పందం జరిగిందని భరద్వాజ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎన్ని భాషల్లో విడుదలయ్యే అతిపెద్ద పాన్ ఇండియా సినిమాకైనా సరే గరిష్టంగా 200 కోట్ల రూపాయలకు మించి డిజిటల్ రైట్స్ కొనకూడదని, అలాగే మీడియం బడ్జెట్ సినిమాలను కేవలం 10 కోట్ల రూపాయల లోపే కొనుగోలు చేయాలని ఓటీటీ సంస్థలు గట్టిగా ఫిక్స్ అయ్యాయని తెలిపారు. ఈ ఓటీటీ రేట్లు తగ్గితేనే ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిన హీరోల రెమ్యునరేషన్లు, బడ్జెట్లు అదుపులోకి వచ్చి సినిమా మళ్లీ బతుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు కేవలం థియేటర్లలోని ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కోసమే సినిమాలు తీస్తూ కంటెంట్ ను పక్కన పెడుతున్నారని విమర్శించారు. టాలీవుడ్ లో క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీతో 'అంతఃపురం' సినిమా సమయంలో జరిగిన క్రియేటివ్ విభేదాల గురించి, చిరంజీవితో గ్యాప్ గురించి, అలాగే మోహన్ బాబుతో తనకున్న పాత అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోల రెమ్యునరేషన్ల పెంపునకు ఓటీటీల కాంపిటీషనే ప్రధాన కారణమన్నారు. చివరగా తాను దర్శకత్వం వహించిన ముగ్గురు వ్యక్తుల ప్రేమకథా చిత్రం 'వదల' ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్తూ, పరిశ్రమలో 50 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రేక్షకులకు తమ్మారెడ్డి భరద్వాజ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

Tammareddy Bharadwaja, Interview, Vadala Movie, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com