Home

»

Exclusive Movie News

వందల కోట్లు సంపాదించిన శోభన్ బాబు చివరికి ఏం తీసుకెళ్లారు?

Aug 25, 2026 12:17PM

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అట్లూరి పూర్ణచంద్రరావు.. సీనియర్ హీరో సోగ్గాడు శోభన్ బాబు ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఆయన సంపాదించిన కోట్ల కొద్దీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ స్టార్ హీరో సంపాదించనంతగా శోభన్ బాబు దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా డబ్బు ఆర్జించారనేది ఎవ్వరూ కాదనలేని సత్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, శోభన్ బాబుగారు వందల కోట్లు సంపాదించినప్పటికీ చివరికి వెళ్తూ వెళ్తూ ఎంత పట్టుకెళ్లారు, జీవితంలో దేనికోసం అంతగా సంపాదించి ఎంత అనుభవించారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశమని తెలిపారు.

అదే సమయంలో ఇటీవల శోభన్ బాబు క్లాసిక్ హిట్ ‘సోగ్గాడు’ సినిమా పూర్తయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దసరా బుల్లోడు సినిమా సమయం నుంచే ‘సోగ్గాడు’ అనే టైటిల్ తన వద్ద చాలా కాలం ఉందని, కానీ దర్శకుడు వి.వి. రాజేంద్రప్రసాద్ దసరా బుల్లోడు టైటిల్ వైపే మొగ్గు చూపారని తెలిపారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామానాయుడు గారు శోభన్ బాబుతో సినిమా చేస్తున్న సమయంలో ఈ టైటిల్ కోరగా, తాను సంతోషంగా రామానాయుడు గారికి ఇచ్చేశానని చెప్పారు. ఈ 50 ఏళ్ల వేడుకలో భాగంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు, నరసింహారావు గార్లు తదితరులు తనను ఆహ్వానించి, ప్రత్యేకంగా కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో ఘనంగా సన్మానించడం పట్ల పూర్ణచంద్రరావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అలాగే తన వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఎంతగానో మార్గదర్శనం చేశారని పూర్ణచంద్రరావు వివరించారు. 1952 వరకు గుడివాడలోని ఒకే పాఠశాలలో తామిద్దరం చదువుకున్నామని, తదనంతరం ఉద్యోగ అన్వేషణలో భాగంగా తాను ఢిల్లీ వెళ్లినప్పుడు రామోజీరావు గారిని అనుకోకుండా కలిశానని చెప్పారు. అప్పటికి తాను SSLC ఫెయిల్ అయ్యానని చెప్పగా, రామోజీరావు జర్నలిజం నేర్చుకుంటారా లేదా చిట్‌ఫండ్ కంపెనీ పెడతారా అని ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో తన వద్ద రూపాయి పెట్టుబడి కూడా లేదని, సమాజంలో తనని ఎవరు నమ్ముతారని రామోజీరావు గారి ముందు సందేహం వ్యక్తం చేయగా.. "ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే బయటి ప్రపంచం నిన్ను నమ్ముతుంది" అని రామోజీరావు అమూల్యం అయిన సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఒక్క మాట తన జీవితంలో బలమైన మార్గదర్శిగా నిలిచిందని, ఆ స్ఫూర్తితోనే తాను చిత్రసీమలో స్వయంకృషితో అట్లూరి పూర్ణచంద్రరావుగా ఒక స్వతంత్ర నిర్మాతగా నిలబడగలిగానని చెప్పారు.

జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, సింప్లిసిటీని కాపాడుకోవడం అనేది రామోజీరావుతో పాటు రిలయన్స్ దిగ్గజం ధీరూభాయ్ అంబానీ, జేఆర్‌డీ టాటా, దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీనియర్ నటుడు మురళీమోహన్ వంటి మహానుభావులను చూసి నేర్చుకున్నానని అట్లూరి పూర్ణచంద్రరావు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

 

 

Producer Atluri Purnachandra Rao, Interview, Sobhan Babu, Soggadu Movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com