
బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుకాబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK111' సరికొత్త రికార్డుల సృష్టికి సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' వంద కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 1993 నాటి ముంబై మాఫియా, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కథని అద్భుతంగా డిజైన్ చేశారు గోపీచంద్. బాలయ్యని 'కింగ్ ఆఫ్ ఖోస్' (King of Chaos) అని పిలుస్తుండటం నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నయనతార స్థానంలో ప్రాజెక్ట్‌లోకి వచ్చిన కాజల్ ఇప్పటికే మూవీ గురించి మాట్లాడుతు తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకం అని పేర్కొంది. ఇటీవలే విడుదలైన కాజల్ ఫస్ట్ లుక్ లో ఒక ప్రభుత్వ కార్యాలయంలో చీరకట్టు, కంటి అద్దాలతో ఎంతో హుందాగా, పవర్‌ఫుల్ ఆఫీసర్‌లా కనిపిస్తున్న కాజల్ రోల్ తాను చెప్పినట్టుగానే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో దాదాపు 30 శాతం కీలక సన్నివేశాలు కాజల్ చుట్టూనే తిరుగుతాయని చిత్ర యూనిట్ లీక్ ఇచ్చింది.
వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చేస్తుండటం టాలీవుడ్‌లో అతిపెద్ద అసెట్ అని చెప్పవచ్చు. వృద్ధి సినిమాస్ పతాకంపై పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్. థామన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో రూపొందుతున్న 5 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ ముంబై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. దాదాపు 80 శాతం టాకీ పార్ట్ పూర్తయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భారీ యాక్షన్ విందును దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఏవైనా జాప్యం జరిగితే, ప్రత్యామ్నాయంగా డిసెంబర్ 4వ తేదీని బ్యాకప్ రిలీజ్ డేట్‌గా లాక్ చేసి ఉంచారు. ఏదేమైనా 2026 సెకండాఫ్‌లో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






