
సరికొత్త అడ్వెంచరస్ మిస్టరీ థ్రిల్లర్ 'నాగబంధం' (Nagabandham) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh). ఈ సందర్భంగా తెలుగువన్(TeluguOne)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నభా తన పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా మేకింగ్ విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితం, కెరీర్ బ్రేక్ గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో తన పాత్ర పేరు 'పార్వతి' అని, ఇది చాలా సాంప్రదాయబద్ధమైన, వేద విద్యార్థిని పాత్ర అని నభా తెలిపారు. లార్డ్ పద్మనాభస్వామి భక్తురాలిగా ఎంతో ఎమోషనల్ డెప్త్, విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇదని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎమోషనల్ ఎనర్జీని ఈ పాత్ర కోసం ఉపయోగించాల్సి వచ్చిందని, ఒక కూతురిగా, సోదరిగా పార్వతి తీసుకునే నిర్ణయాలు కథను మలుపు తిప్పుతాయని నభా వెల్లడించారు.
సినిమా మేకింగ్ గురించి మాట్లాడుతూ, దర్శకుడు అభిషేక్ కథను కంప్యూటర్లలో కాకుండా ఒక బుక్లెట్ లాంటి స్టోరీ బోర్డ్‌లో అద్భుతమైన డ్రాయింగ్స్‌తో సిద్ధం చేసుకున్నారని కొనియాడారు. కేవలం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసమే దాదాపు 5 నుంచి 6 వేల మంది సాంకేతిక నిపుణులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారని చెప్పి సినిమా భారీతనాన్ని కళ్ళకు కట్టారు. ప్రొడ్యూసర్స్ కిషోర్, నిశిత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని అన్నారు. ఈ సినిమా కోసం నిర్మించిన సెట్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే, అది సెట్టా లేక నిజమైన లోకేషనా అనేది నటులకే అర్థం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హీరో విరాట్ అశ్విన్ గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ చలిలో షర్ట్ లేకుండా నైట్ షూట్స్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడని, అతని డెడికేషన్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని నభా ప్రశంసించారు. అలాగే ఈ చిత్రంలో జగపతిబాబు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, రిషబ్ సాహ్నీ విలన్‌గా నటిస్తున్నట్లు ఆమె రివీల్ చేశారు.
ఇక తన కెరీర్ యాక్సిడెంట్ బ్రేక్ గురించి మాట్లాడుతూ.. ఆ కష్ట కాలంలో చాలా మానసిక వేదన అనుభవించానని, కానీ స్పోర్ట్స్ పర్సన్స్ గాయాల నుంచి కోలుకుని ఎలాగైతే కంబ్యాక్ ఇస్తారో, తాను కూడా అలాగే మరింత బలంగా తయారయ్యానని ఎమోషనల్ అయ్యారు. 'సూర్యాసురం' పాటలో గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో అర్ధరాత్రి వేళ సింగిల్ షాట్లో చేసిన వన్ మినిట్ డ్యాన్స్ సీక్వెన్స్ తన లైఫ్‌లోనే అత్యంత థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అని గుర్తుచేసుకున్నారు.
చివరగా, గ్లామర్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి ప్రదర్శించే ఎనర్జీ అని తనదైన శైలిలో నిర్వచించారు. అడ్వెంచర్, మిస్టరీ, లవ్, ఎమోషన్స్ కలగలిసిన విజువల్ వండర్ 'నాగబంధం' జూలై 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుందని, అందరూ థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని నభా నటేష్ కోరారు.





