
టాలీవుడ్ హిస్టరీలో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి (Kodandarami Reddy). మెగాస్టార్ చిరంజీవితోనే కాకుండా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)తో కూడా ఆయన ఎన్నో సంచలన విజయాలను నమోదు చేశారు. ముఖ్యంగా 1986 వ సంవత్సరం బాలయ్య కెరీర్‌లోనే ఒక గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది. ఆ ఏడాది బాలకృష్ణ నటించిన ఆరు సినిమాలు వరుసగా వంద రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’.
ఈ సినిమా వెనుక ఉన్న కొన్ని అరుదైన, ఆసక్తికరమైన జ్ఞాపకాలను దర్శకుడు కోదండరామిరెడ్డి 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘అనసూయమ్మగారి అల్లుడు’ కథ అనుకున్న తర్వాత, ఆ విషయాన్ని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR)కి చెప్పడానికి వెళ్లిన క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పెద్దాయన కథను ఓకే చేశారని కోదండరామిరెడ్డి తెలిపారు.
కథ విన్న తర్వాత ఎన్టీఆర్, ‘విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు బ్రదర్?’ అని అడగ్గా, ‘కైకాల సత్యనారాయణ గారు’ అని కోదండరామిరెడ్డి సమాధానం ఇచ్చారు. దానికి ఎన్టీఆర్ ఎంతో సంతోషపడి.. ‘చాలా మంచి ఎంపిక, ఇక షూటింగ్‌తో ప్రొసీడ్ అవ్వండి’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ఆ నమ్మకమే సినిమాను అంత పెద్ద హిట్ చేయడానికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రానికి నందమూరి హరికృష్ణ ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారని కోదండరామిరెడ్డి తెలిపారు. షూటింగ్ సమయంలో భారీ సెట్లు వేసినప్పటికీ హరికృష్ణ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, దర్శకుడిగా తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని కొనియాడారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు, అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో హరికృష్ణ పనిచేశారని గుర్తుచేసుకున్నారు.
షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు స్వయంగా ఎన్టీఆర్ గారే సెట్స్‌కు రావడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని కోదండరామిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఒక సీఎం హోదాలో ఉండి కూడా లొకేషన్‌కు వచ్చి, కాసేపు కూర్చుని కాఫీ తాగి అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన అంతటి మహానుభావుడు ప్రొడ్యూసర్‌గా ఉన్న సినిమాలో తాము పనిచేయడం పూర్వజన్మ సుకృతమని ఆయన వ్యాఖ్యానించారు.
అప్పట్లో వరుస సినిమాలు చేస్తున్నప్పుడు తనకు ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదని కోదండరామిరెడ్డి స్పష్టం చేశారు. రైటర్స్ అంతా చాలా సపోర్టివ్‌గా ఉండటం వల్లే కథలు త్వరగా ఓకే అయ్యేవని, కేవలం ముప్పై రోజుల్లోనే ఒక్కో సినిమా షూటింగ్ పూర్తి చేసేవాళ్లమని నాటి రోజులను గుర్తుచేసుకుంటూ ముగించారు.





