
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ కామెడీ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ స్టైల్, పొదుపు సూత్రాల నేపథ్యంలో వచ్చిన ‘బడ్జెట్ పద్మనాభం’ (Budget Padmanabham) సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. జగపతిబాబు, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని హిలేరియస్ కామెడీ సీన్స్ తాజాగా యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్బీ శ్రీరామ్, జెన్నీ, వై. విజయల కాంబినేషన్‌లో వచ్చే ప్రతీ సీన్ ప్రేక్షకులకు నాన్‌స్టాప్ నవ్వులను పంచుతోంది.
ఈ వైరల్ వీడియోలో బడ్జెట్ పద్మనాభం (జగపతిబాబు) క్యారెక్టర్ ఎంత పిసినారిగా ఉంటుందో చూపించే సీన్స్ అద్భుతంగా పండాయి. పొద్దున్నే లేచి దేవుడికి అగరబత్తిని సగానికి కట్ చేసి వెలిగించడం, ఇడ్లీల ఈశ్వరరావు పొద్దున్నే వ్యాపారం కోసం వస్తే.. 'నాలుగు ఇడ్లీలు తింటే మధ్యాహ్నం ఆకలి వేయకుండా ఉంటుందా? ఒకేసారి మధ్యాహ్నమే తింటాలే' అంటూ డబ్బులు దాచే ప్రయత్నం చేయడం నవ్వులు పూయిస్తుంది. ఇది కక్కుర్తి కాదు, బడ్జెట్ అంటూ జగపతిబాబు ఇచ్చే బిల్డప్ అంతా ఇంతా కాదు.
అలాగే ఆఫీస్ కొలీగ్ ఎం.ఎస్. నారాయణ ఆటో ఖర్చు మిగులుతుందని పద్మనాభం బండిపై లిఫ్ట్ అడిగితే.. దిగాక 'ఆటోలో వస్తే నలభై అయ్యేది, నాకు ఇరవై రూపాయల క్యాష్ కొట్టు' అని పెట్రోల్ డబ్బులు డిమాండ్ చేయడం ఈ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ సీన్.
ఇక ఈ వీడియోలో కొద్ది నెలల నుంచి ఇంటి అద్దె బాకీ ఉన్న ఎల్బీ శ్రీరామ్, ఇంటి ఓనర్ రాగానే తప్పించుకోవడానికి వేసే ప్లాన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అద్దె అడగడానికి వచ్చిన ఓనర్‌ను భయపెట్టేందుకు ఏకంగా ఆత్మహత్య నాటకం ఆడతాడు. తన జేబులో 'మరణ వాంగ్మూలం' లెటర్ ఉందని, తాను చనిపోతే ఆత్మహత్యకు కారణం ఇంటి ఓనరేనని రాశానని బెదిరించడం ఇక్కడ హైలైట్.
చనిపోయాక కూడా తన శవాన్ని వినియోగదారుల కోర్టుకు తీసుకెళ్లి లక్ష రూపాయల నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోమని భార్య (వై. విజయ)కి ఉచిత సలహా ఇవ్వడం ఎల్బీ శ్రీరామ్ మార్క్ కామెడీకి నిదర్శనం.
ఎల్బీ శ్రీరామ్ నాటకం దెబ్బకు భయపడిపోయిన ఓనర్.. అద్దె కోసం కాకుండా, ఇంటి కప్పు కారుతుంటే బాగు చేయించడానికి వచ్చానని ప్లేట్ ఫిరాయిస్తాడు. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా అంటూ ఎల్బీ శ్రీరామ్ అనడం, ఆవేశంలో ఊపిరి తీసేసుకుంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడేది అని ఓనర్ కంగారు పడటం నవ్వుల పువ్వులు పూయించింది.
ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నేటి డిజిటల్ కాలంలోనూ ఈ కామెడీ సీన్స్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. పాత రోజుల్లోని స్వచ్ఛమైన హాస్యాన్ని మిస్ అవుతున్న సినీ ప్రియులకు ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు.






