Home

»

Exclusive Movie News

రివర్స్ ముష్టి: బిచ్చగాళ్లకే షాక్ ఇచ్చిన కోడలు.!

Aug 17, 2026 12:11PM

తెలుగు సినీ ప్రేక్షకులను దశాబ్దాల పాటు నవ్వుల తీరాల్లో ముంచెత్తిన లెజెండరీ హాస్య నటులు బాబు మోహన్, ఎం.ఎస్. నారాయణ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరి ముఖంలోనూ టక్కున నవ్వు వికసిస్తుంది. వీరిద్దరూ కలసి వెండితెరపై ప్రదర్శించిన కామెడీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ముఖ్యంగా 'వైఫ్' సినిమాలో బిచ్చగాళ్ల వేషధారణలో వీరు చేసిన హాస్య విన్యాసాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, సోషల్ మీడియా యుగంలోనూ యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ రూపంలో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. గురుశిష్యుల మధ్య సాగే ఈ కామెడీ సన్నివేశంలో ప్రతి మాట, ప్రతి హావభావం ఎంతో వినోదాత్మకంగా సాగుతుంది.

ఈ హాస్య ఘట్టంలో సీనియర్ బిచ్చగాడిగా బాబు మోహన్, ఆయన వద్ద భిక్షాటన విద్యను అభ్యసించే నవశిష్యుడిగా  ఎం.ఎస్. నారాయణ కనిపించి మెప్పించారు. బిచ్చమెత్తడంలో ఉన్న మెళకువలు, పాటించాల్సిన చిట్కాలు, మాట్లాడాల్సిన "ముష్టి భాష" గురించి గురువుగారు శిష్యుడికి పాఠాలు చెప్తుంటారు. "కడుపు లోపల నుంచి అమ్మ అనే పదం రావాలి" అని గురువు చెబుతుంటే, శిష్యుడు అమాయకంగా ఫాలో అవుతూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని ఆకలి కేకలు వేస్తే, ఇంట్లోని గృహిణి వచ్చి "ఎలుకల మందు" చేతిలో పెట్టే సన్నివేశంతో శిష్యుడికి మొదటి షాక్ తగులుతుంది.

ఇక ఆ తర్వాత ఒక ఇంట్లో ధర్మం చేయమంటే, "ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ లేరు, పైకి వెళ్ళు" అంటారు. ఎం.ఎస్. నారాయణ దాన్ని అక్షరాలా తీసేసుకుని నిజంగానే డాబా పైకి ఎక్కబోతారు. అప్పుడు బాబు మోహన్ ఆపి, "రేయ్ పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదురా, పక్కింటికి!" అని తిట్టే సీన్ నవ్వులు పూయిస్తుంది.

ఇక ఈ 'ముష్టి లాంగ్వేజ్', 'అడుక్కునే సిలబస్' నేర్చుకోవడానికి శిష్యుడికి చాలా టైమ్ పడుతుందని గురువు గారు తెగ బాధపడిపోతుంటారు. ఈ క్రమంలోనే అలా అడుక్కుంటూ తన కాలనీకే రావడంతో.. ఎవరైనా గుర్తుపడతారని ఎం.ఎస్. నారాయణ భయపడతారు. "నేను వేసిన మేకప్ వల్ల.. నిన్ను నీ భార్య కూడా గుర్తుపట్టదు." అని బాబూమోహన్ అంటారు. నిజంగానే తన భార్య వెళ్తుండగా ఎం.ఎస్. నారాయణ ఏమే అని పిలవగా, ఆమె ఎవడ్రా నువ్వని చెంప మీద కొట్టి వెళ్తుంది.

ఇక అసలైన కామెడీ లాస్ట్ లో ఉంటుంది. "ధర్మం చేయి తల్లి" అని ఒక ఇంటి దగ్గరకు వెళ్లి అడగగా .. ఖాళీ గిన్నె పట్టుకొని ఆ ఇంటి కోడలు బయటకు పరుగెత్తుకుంటూ వస్తుంది. "ఇదిగో ముష్టి అబ్బాయి. కంచాలన్నీ కడిగి తగలెట్టాక.. మా అత్త, ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చెలో కూడు ఈ గిన్నెలో తగలేయ్" అంటూ అన్నం తీసేసుకుంటుంది. ఈ రివర్స్ ముష్టి ఏంటి గురువా అని ఎం.ఎస్. నారాయణ షాక్ అవ్వగా.. "ఈ టాపిక్ నీకు 8th లెస్సన్ లో వస్తుంది" అని బాబూమోహన్ చెప్పడం ఫన్నీగా ఉంటుంది.

 

 

Babu Mohan, MS Narayana, Beggar Comedy, Wife Movie


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com