Home

»

Exclusive Movie News

సుకుమార్ పంపిన ఆ ఒక్క మెసేజ్.. 'రంగస్థలం'తో పోలికలపై అఖిల్ క్రేజీ క్లారిటీ!

Jul 4, 2026 4:52PM

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త ఊరమాస్, రస్టిక్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' (LENIN) ప్రమోషన్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌తో సాగుతున్నాయి. ఈ సినిమాకు మురళీ కిషోర్ దర్శకత్వం వహించగా, క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ ట్రైలర్‌ను చూసి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సేలు తెలుగువన్ (TeluguOne) ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తెరవెనుక రహస్యాలను పంచుకున్నారు.

ఈ సినిమాకు 'లెనిన్' అనే భిన్నమైన టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కథను అఖిల్ వివరిస్తూ, మొదట కథ విన్నప్పుడు తన మనసులో కూడా ఇదే ప్రశ్న తలెత్తిందని చెప్పారు. రాయలసీమ, తిరుపతి పరిసర ప్రాంతాలలో 1950, 1960ల కాలంలో ఒక చిన్న కమ్యూనిస్ట్ మూమెంట్ నడిచిందని, ఆ సిద్ధాంతాలను నమ్మిన కొందరు వ్యక్తులు తమ పిల్లలకు లెనిన్ బాబు, స్టాలిన్ బాబు అనే పేర్లు పెట్టుకున్నారని తెలిపారు. అయితే ఈ చిత్రానికి ఎలాంటి కమ్యూనిజం బ్యాక్‌డ్రాప్ లేదా ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేదని, ఇది పూర్తిగా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫిక్షనల్ డ్రామా అని అఖిల్ స్పష్టం చేశారు. దర్శకుడు తన సొంత ఊరిలో చూసిన కొన్ని పాత్రల ఆధారంగా ఒక చిన్నపాటి 'మహాభారతం' లాంటి భావోద్వేగాల కలయికతో ఈ కథను అద్భుతంగా అల్లారని కొనియాడారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి చాలా మంది దీనిని రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమాతో పోలుస్తుండటంపై అఖిల్ చాలా స్పష్టతతో సమాధానమిచ్చారు. రంగస్థలంతో ఈ సినిమాను పోల్చడం సరైనది కాదని, అది టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా వైబ్స్ ఏమైనా ఇందులో కనిపిస్తే అది సంతోషమేనని, లెనిన్ థియేటర్లలో తనను తాను నిరూపించుకున్నాకే ఆ పోలికలు అర్ధవంతంగా ఉంటాయన్నారు. ఇదే సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు తనకు పంపిన వ్యక్తిగత మెసేజ్ గురించి అఖిల్ రివీల్ చేశారు. "ఐ లవ్ ద ట్రైలర్.. నీలో సిన్సియారిటీ కనిపిస్తోంది.. ఆల్ ది బెస్ట్" అంటూ సుకుమార్ పంపిన ఆ ఒక్క మెసేజ్ తనలో ఎంతో కొండంత బలాన్ని నింపిందని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం, చిత్తూరు యాసను పట్టుకోవడం కోసం పడిన కష్టాన్ని అఖిల్ పంచుకున్నారు. ఒక నెల రోజుల పాటు ఒక స్కూల్ పిల్లోడిలాగా భుజాన బ్యాగ్ వేసుకుని, పారాగాన్ చెప్పులు తొడుక్కుని నిరంతరం తిరుగుతూ వర్క్‌షాప్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. తన తాతగారు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు ఎక్కడి నుండి అయితే ఇండస్ట్రీకి వచ్చారో, ఆ రూట్స్ వెతుక్కుంటూ తాను ఈ రస్టిక్ పాత్ర వైపు ప్రయాణించానని ఎమోషనల్ అయ్యారు. ఏఎన్నార్ గారి సినిమాల్లో తనకు 'దొంగరాముడు' (Donga Ramudu) అంటే ప్రాణమని, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గత 10-12 ఏళ్ల క్రితం తనకు కొన్ని విసిడీలు (VCDs) పంపించి ఏఎన్నార్ గారు తన స్టార్‌డమ్ పక్కన పెట్టి క్యారెక్టర్లలో ఎలా లీనమయ్యేవారో చూపించారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులు అఖిల్‌ను మరిచిపోయి కేవలం 'లెనిన్' పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే 'భారతి' అనే పవర్‌ఫుల్ పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించారు. ఈ కథలో భారతి పాత్రే 'సోల్' (ఆత్మ) అని భాగ్యశ్రీ చెప్పారు. ట్రైలర్‌లో లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్‌ను భాగ్యశ్రీ అద్భుతంగా పలకడంపై స్పందిస్తూ, అంత పెద్ద డైలాగ్ చెప్పడం ఒక బాధ్యతగా ఫీల్ అయ్యానని ఆమె పేర్కొంది.

కాగా, తన తల్లి అమల రియాక్షన్ గురించి అఖిల్ మాట్లాడుతూ.. ఆమె ఇంకా సినిమా చూడలేదని, ట్రైలర్, పాటల కట్స్ మాత్రమే చూశారని చెప్పారు. ఫస్ట్ కాపీ పూర్తి డబ్బింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పక్కాగా రెడీ అయిన తర్వాతే థియేటర్ ఎక్స్పీరియన్స్‌తో అమ్మకు చూపించాలని తాను కండిషన్ పెట్టానని నవ్వేసారు. ఇక తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ.. ఆయన పని రాక్షసుడు అని, బెస్ట్ అవుట్ పుట్ రావడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారని అన్నారు. లెనిన్ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com