Home

»

Exclusive Movie News

120 కేజీల బరువు.. తల్లి వదిలేసింది.. కొన్నేళ్లు సీక్రెట్‌గా బ్రతికిన హీరోయిన్ కన్నీటి గాథ.!

Aug 1, 2026 3:59PM

సినిమా గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారల వెనుక ఎవరికీ తెలియని కన్నీటి గాథలు ఉంటాయి. 'టెన్త్ క్లాస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి శరణ్య నాగ్ జీవితం కూడా అలాంటి ఒక భావోద్వేగ పోరాటమే. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఆమె పడిన శారీరక, మానసిక, ఆర్థిక వేదనలు ఎంతో మందికి తెలియవు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అనుకోకుండా వచ్చిన ఆరోగ్య సమస్యలు ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి.

కేవలం 7 నుంచి 8 నెలల స్వల్ప వ్యవధిలోనే శరణ్య శరీరం ఊహించని మార్పుకు గురైంది. తీవ్రమైన హైపోథైరాయిడిజం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల 70 కేజీలు ఉన్న ఆమె బరువు ఏకంగా 120 కేజీలకు పెరిగిపోయింది. బరువు విపరీతంగా పెరగడమే కాకుండా చర్మంపై నల్లటి మచ్చలు రావడం, కొద్ది దూరం నడిచినా లేదా మాట్లాడినా తీవ్రమైన ఆయాసం రావడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ హఠాత్ మార్పుతో తీవ్ర ఆత్మన్యూనతా భావానికి గురైన శరణ్య, 2015 నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ప్రజలు తన్ను చూసి గేలి చేస్తారనే భయంతో బయటకు రావడమే మానేశారు.

కేవలం ఆరోగ్య సమస్యలే కాదు, కుటుంబ పరంగా కూడా శరణ్యను దురదృష్టం వెంటాడింది. చిన్నప్పుడే తండ్రి దూరమయ్యారు. తమిళ్ లో 'పేరాన్మై' సినిమా పెద్ద హిట్ సాధించిన సమయంలో, కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమెకు ఊహించని మరో దెబ్బ తగిలింది. తనకు వేరే జీవితం కావాలంటూ శరణ్య తల్లి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఇతర కుటుంబ సభ్యులు లేదా బంధువులు తోడు కూడా లేదు. తల్లికి మళ్లీ ఫోన్ చేసినా, నన్ను భవిష్యత్తులో కలవద్దని చెప్పడంతో ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒంటరిగానే జీవించడం ప్రారంభించారు.

పరిశ్రమలో సంపాదించి దాచుకున్న డబ్బులన్నీ ట్రీట్ మెంట్ కే ఖర్చైపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైంది. దాంతో వలసరవాక్కమ్‌లో నెలకు ₹12,000 అద్దె ఉండే ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ రూమ్‌కి మారి అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. కరోనా మహమ్మారి కంటే ముందు నుంచే సమాజానికి ముఖం చూపించలేక మాస్క్ ధరించే బయటకు వెళ్లేవారు. 2018-19 ప్రాంతంలో దర్శకుడు జయం రాజా ఆమెకు ఫోన్ చేసి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయినా ఇండస్ట్రీకి తిరిగి రావాలని ప్రోత్సహించినా, తన శారీరక స్థితి వల్ల తీవ్ర నైరాశ్యంలో ఉన్న శరణ్య ఆ అవకాశాన్ని కూడా తీసుకోలేకపోయారు.

అయితే 2020 లాక్‌డౌన్ సమయంలో శరణ్య జీవితంలో ఒక మలుపు తిరిగింది. తన వీధిలోని పారిశుధ్య కార్మికులను ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు హఠాత్తుగా వైరల్ అయ్యాయి. అది చూసిన ఒక ప్రముఖ తమిళ మీడియా సంస్థ ఆమెను సంప్రదించి స్పెషల్ ఇంటర్వ్యూ చేయడంతో ఆమె పునరాగమనం వేగవంతమైంది. ఆ తర్వాత దృఢ సంకల్పంతో డాక్టర్లు, ఫిట్‌నెస్ ట్రైనర్ల పర్యవేక్షణలో కఠినమైన బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభించి అద్భుతమైన ఫలితాలు సాధించారు. దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, డిప్రెషన్, ఒంటరితనాన్ని జయించిన శరణ్య నాగ్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

 

 

Actress Saranya Nag, Interview, Emotional Story

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com