Home

»

Exclusive Movie News

ఆ వంద కోట్లు నాకొద్దు.. చిరంజీవి మాటలకు ఏడ్చేశాను!

Jun 27, 2026 12:27PM

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన నటననే నమ్ముకుని విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సత్యదేవ్ (Satyadev). ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ 'రావు బహదూర్' (Rao Bahadur) విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగువన్‌(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన సినీ ప్రయాణం, పడ్డ కష్టాలు మరియు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ఉన్న అనుబంధంపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ వేణు బిక్కి అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సత్యదేవ్ ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. "గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులో విలన్ ఆఫర్ వచ్చింది, కానీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను. గతంలో ప్రముఖ కెమెరామన్ నీరవ్ షా నాతో మాట్లాడుతూ.. సత్య, నువ్వు విలన్ పాత్రలు చేస్తే చాలా తొందరగా రూ. 100 కోట్లు సంపాదిస్తావు అని చెప్పారు. దానికి నేను నవ్వుతూ.. సార్, నాకు ఆ వంద కోట్లు వద్దు అని అన్నాను. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసి నన్ను నేను ఒకే తరహా పాత్రలకు స్టీరియోటైప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు నటుడిగా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యం" అని సత్యదేవ్ స్పష్టం చేశారు.

దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఒక అమూల్యమైన సలహా ఉందని సత్యదేవ్ రివీల్ చేశారు. గాడ్ ఫాదర్ షూటింగ్ సమయంలో చిరంజీవి తనతో మాట్లాడుతూ.. "సత్య, నువ్వు ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నాతో పాటు ఆపోజిట్ రోల్‌లో నటిస్తే నీ నటన మరింత హైలైట్ అవుతుంది, నీకు మంచి ప్రొడ్యూసర్స్ దొరుకుతారు, ఆ తర్వాత మళ్లీ విలన్ పాత్రలు చేయకుండా నీ సొంత సినిమాలు నువ్వు హీరోగా చేసుకోవచ్చు" అని ఒక పక్కా ప్లాన్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అన్నయ్య చిరు చెప్పిన ఆ మాటల వల్లే తాను విలన్ ఆఫర్లను వదులుకున్నానని, ఈ క్రమంలోనే తనకు ‘జీబ్రా’ ప్రొడ్యూసర్స్ దొరికారని సత్యదేవ్ తెలిపారు.

తన 14 ఏళ్ల సినీ కెరీర్‌లో అత్యంత మర్చిపోలేని రోజు జూలై 8, 2020 అని సత్యదేవ్ చెప్పారు. తాను ఎవరినైతే చూసి ఇండస్ట్రీకి వచ్చానో, ఆ మెగాస్టారే స్వయంగా ఫోన్ చేసి తనను ఇంటికి పిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు వారం రోజుల్లోనే బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో, బ్రోచేవారెవరురా సినిమాలు చూసి మెచ్చుకున్నారని, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. 

ఇక తన తాజా చిత్రం ‘రావు బహదూర్’ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ఎక్స్‌పెరిమెంట్ కాదని, తెలుగు ప్రేక్షకులపై ఉన్న గౌరవంతో ఇండస్ట్రీకి రాస్తున్న ఒక ‘లవ్ లెటర్’ అని అభివర్ణించారు. మలయాళ, తమిళ సినిమాల తరహాలో ఒక విభిన్నమైన సైకలాజికల్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని, ఈ చిత్రంలో తాను 25, 40, 60 ఏళ్ల మూడు విభిన్న వయసుల పాత్రల్లో, ఏడు రకాల గెటప్పులలో కనిపిస్తానని, 60 ఏళ్ల క్యారెక్టర్ కోసం ప్రతిరోజూ 5 గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్ వేసుకునేవాడినని సత్యదేవ్ పేర్కొన్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com