
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కథ, నటీనటులు, పాటలతో పాటు సినిమా నిర్మాణం వెనుక జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు కూడా వాటిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. శోభన్ బాబు, జమున జంటగా నటించిన ఈ సినిమా విడుదలై 55 ఏళ్లు పూర్తవుతోంది. అయితే ఈ సినిమా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
1971లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా శోభన్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ నటుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయనకు ఈ సినిమా తర్వాత హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అలా శోభన్ బాబు స్టార్డమ్కు బలమైన పునాది వేసిన చిత్రంగా ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ నిలిచిపోయింది.
ఈ సినిమా వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కావిలిపాటి విజయలక్ష్మి రచించిన ‘విధి విన్యాసాలు’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించారు. సత్యచిత్ర బ్యానర్‌పై సూర్యనారాయణ, సత్యనారాయణ నిర్మించారు. విశేషం ఏమిటంటే.. ఈ నిర్మాతలకు ఇదే తొలి సినిమా.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సామాన్య ఆర్టీసీ కండక్టర్, ఎంతో ఆస్తిపాస్తులున్న తహశీల్దార్ గారి అమ్మాయి మధ్య చిగురించే స్వచ్ఛమైన ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ప్రేమకు అంతస్తులతో సంబంధం లేదనే నినాదంతో సాగే ఈ కథలో, అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించరు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత, వారిని ఎలాగైనా విడగొట్టాలని కుటుంబ సభ్యులు అనేక కుట్రలు పన్నుతారు. హీరోపై లేనిపోని అనుమానాలు సృష్టించి, భార్యాభర్తల మధ్య విభేదాలు తీసుకొస్తారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
పేదరికంలో ఉన్నవారికి తక్కువ బుద్ధులే ఉంటాయని గేలిచేస్తూ తన తండ్రి తాసిల్దారు కనుక మంచి బుద్ధులు ఉంటాయని, తన కొడుకును వాళ్ల దగ్గర పెంచుతానని మొండికేస్తుంది భార్య. అహం దెబ్బతిన్న భర్త తన కొడుకును కలెక్టర్ చేస్తానని సవాల్ చేస్తాడు. చివరకు అనుకున్నది సాధిస్తాడు. కతన కొడుకును కలెక్టర్‌గా తీర్చిదిద్దుతాడు. తండ్రి కొడుకుల అనుబంధం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, కుటుంబ సంబంధాల చుట్టూ సాగే ఈ కథ అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే.. శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తహశీల్దార్ పాత్రలో నాగభూషణం, మధుమతిగా జమున నటించారు. చంద్రకళ, రావి కొండలరావు, సాక్షి రంగారావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. కథలోని భావోద్వేగాలకు ఆత్రేయ రాసిన పాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. ‘కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం’, ‘నీకున్నది నేనని – నాకున్నది నీవని’ వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులకు గుర్తుండిపోయాయి.

ఇక ఈ సినిమా ద్వారా మరో దర్శకుడు కూడా తన సినీ ప్రయాణంలో కీలకమైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఆయనే కె. రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు దగ్గరే అప్పటికి చాలా సినిమాలకు సహాయకుడిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావుకు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా ఒక ముఖ్యమైన అనుభవం. ఆ తర్వాత ఇదే సత్యచిత్ర బ్యానర్‌పై ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ తెరకెక్కించే అవకాశం ఆయనకు దక్కింది. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అంటే.. ఒకవైపు శోభన్ బాబు స్టార్డమ్కు బాటలు వేసిన సినిమా, మరోవైపు రాఘవేంద్రరావు దర్శకుడిగా ఎదగడానికి పునాది వేసిన నిర్మాణ సంస్థ ప్రయాణంలో కీలకమైన చిత్రం ఇదన్నమాట. అంతేకాదు, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సత్యచిత్ర సంస్థ తర్వాతి కాలంలో టాలీవుడ్లో గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించింది.
అలా 55 ఏళ్ల క్రితం వచ్చిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కేవలం ఒక కుటుంబ కథా చిత్రం మాత్రమే కాదు. శోభన్ బాబు కెరీర్, రాఘవేంద్రరావు సినీ ప్రయాణం, సత్యచిత్ర నిర్మాణ సంస్థ చరిత్ర.. ఇలా ఎన్నో విశేషాలతో ముడిపడిన సినిమా. అందుకే ఈ క్లాసిక్ గురించి ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
మీకు నచ్చవచ్చు:
23 ఏళ్ళ క్రితం జరిగింది ఇదే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న తమిళ అమ్మాయి.!
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!
[55 Years Of Tahsildar Gari Ammayi, Tahsildar Gari Ammayi Movie, Sobhan Babu, Jamuna, K S Prakash Rao]




