'సైరా' ఛాన్స్ రావడం మాకో పెద్ద అచీవ్‌మెంట్!
on Aug 27, 2019
మెగాస్టార్ మూవీ 'సైరా.. నరసింహారెడ్డి'కి ఫైట్స్ అందించే అవకాశం రావడం తమ జీవితంలో ఒక అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నామని టాలీవుడ్ టాప్ స్టంట్ డైరెక్టర్స్ రాం-లక్ష్మణ్ అంటున్నారు. 'సైరా' షూటింగ్‌లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కెరీర్ మొదట్లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నారనిపించిందని వారు చెప్పారు. "కెమెరా.. యాక్షన్.. అనగానే ఆయన బాడీలాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. అంటే కెమెరాకు ఆయన బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. అంత గొప్ప నటుడితో పని చేయడం నిజంగా మా అదృష్టం. ఒక సాధారణ స్థితి నుంచి ఆయన ఇంత గొప్ప స్థితికి రావడంతో మాలాంటి వాళ్లను ఆయన ఎంతో ఆప్యాయతగా చూసుకుంటారు" అంటూ ఆనందంతో తబ్బిబ్బయ్యారు రాం-లక్ష్మణ్.
ఫైట్‌మాస్టర్ రాజు శిష్యులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆ కవల సోదరులు ఫైట్ మాస్టర్లుగా మారిన కొద్ది కాలానికే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో, ఆయనతో కలిసి పని చెయ్యడానికి చాలా కాలమే నిరీక్షించాల్సి వచ్చింది. "అన్నయ్యతో రాజు మాస్టర్ చేసిన సినిమాలన్నింటికీ మేము ఉన్నాం. అప్పుడు ఆయనను దగ్గరి నుంచి చూసే అదృష్టం కలిగింది. అయితే ఆయనతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్లం. మేం ఫైట్ మాస్టర్స్ అయ్యేటప్పటికి అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే మా అదృష్టం కొద్దీ 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నంబర్ 150' సినిమాలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు ‘సైరా’ సినిమాలో మేం ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌కు సంబంధించిన బ్లాక్స్ చేశాం. ప్రతి ఒక్క సీనూ అద్భుతంగా ఉంటుంది. ఇండియా లెవెల్‌లో మరో గొప్ప సినిమాను మనం చూడబోతున్నాం. అన్ని భాషల వాళ్లూ ‘సైరా’ గురించి మాట్లాడుకుంటారు" అని వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు.
సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రాంచరణ్ నిర్మించిన 'సైరా' మూవీ అక్టోబర్ 2న విడుదలవుతోంది.