'రంగ్ దే'కి దేవి బాణీలు మొదలుపెట్టాడు
on Aug 27, 2019
నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి జంటగా నటించేందుకు సిద్ధమవుతున్న సినిమా 'రంగ్ దే'. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ 'రంగ్ దే'కి స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలి కాలంలో గేయ రచయితగా పాపులర్ అయిన శ్రీమణి సాహిత్యం అందిస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన విషయాన్ని దేవి, శ్రీమణితో కలిసి తీయించుకున్న ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయడం ద్వారా డైరెక్టర్ వెంకీ తెలియజేశాడు. "రంగ్ దే మ్యూజిక్ జర్నీ స్టార్ట్స్ విత్ రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్" అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు.
సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరాం పనిచేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 2020 వేసవిలో 'రంగ్ దే' ప్రేక్షకుల ముందుకు రానున్నది. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో 'భీష్మ' చిత్రాన్నీ, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాని కూడా చేస్తున్నాడు.
Also Read