ఒడిస్సా పోలీస్ శుభశ్రీకి చిరు ప్రశంసలు
on May 12, 2020
మంచి పని ఎవరు చేసినా అభినందించడానికి ముందుండే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇటీవల ఆయన దృష్టికి ఒక వీడియో వచ్చింది. అందులో మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలికి మహిళా పోలీస్ అన్నం తినిపిస్తున్నారు. అది చూసి చూసి ఆయన మనసు చలించింది. మహిళా పోలీసు ఎవరో తెలుసుకొని ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారు. వివరాలు ఆరా తీస్తే... ఆ పోలీస్ పేరు శుభశ్రీ అని, ఆమె ఒడిస్సాలో పని చేస్తున్నారనీ తెలిసింది. ఉన్నతాధికారులను సంప్రదించి ఆమెతో మెగాస్టార్ చిరంజీవి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆమె మానవతా దృక్పథాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి అంతటి వ్యక్తి స్వయంగా ప్రశంసించడంతో శుభశ్రీ ఆనందానికి అవధులు లేవు.
"మీరు వృద్ధురాలి పట్ల చూపించిన ఆదరణ నా మనసుని తాకింది. చాలా సంతోషంగా అనిపించింది. మీలో ఓ తల్లిని నేను చూశా. మీకు అలా చేయాలని ఎందుకు అనిపించింది?" అని చిరంజీవి శుభశ్రీని అడిగారు.
శుభ శ్రీ మాట్లాడుతూ "నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు సార్. ఆవిడ ఆహారం అందించా. ఆవిడ తన చేతులతో తీసుకునే పరిస్థితిలో లేదు. మానసిక వైకల్యమే కాదు, ఆమెకు అంగవైకల్యం ఉంది. అప్పుడు నేనే స్వయంగా తినిపించాను. 'బాధ్యత నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్ ఒక్కటే చూసుకోవడం కాదు. పౌరులకు ఎలాంటి అవసరం వచ్చినా సహాయపడటం మన కర్తవ్యం' అని మా అడిషనల్ డీజీపీ అరుణ్ సలోంజి చెబుతుంటారు. ఆయన మీరు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పినప్పుడు ఎంతో ఉత్తేజానికి ఉద్వేగానికి లోనయ్యాను. మీరు ఒక మెగాస్టార్ మాత్రమే కాదు.. గొప్ప సామాజిక సేవకులు. మీరు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను నేను చూశాను. మీ సెమినార్లు ఎన్నో విన్నాను. టూరిజం అభివృద్ధి మీరు చేసిన పనులు నాకు తెలుసు. నేను మీ అభిమానిని మీ వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం" అని అన్నారు.
"మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఇలాగే మరిన్ని మంచి పనులు చేయాలి. మీ కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించాలి" అని చిరంజీవి ఆమెతో అన్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
