చిరంజీవి vs రజనీకాంత్... సంక్రాంతికి పోటీ తప్పదా?
on May 14, 2020
గతేడాది సంక్రాంతికి 'పేట'తో సూపర్‌స్టార్ రజనీకాంత్ థియేటర్లలోకి వచ్చారు. ఈ సంక్రాంతికి, 2020లో 'దర్బార్'ను విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి మీద ఆల్రెడీ కర్చీఫ్ వేశారు. దాంతో సంక్రాంతికి సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ తప్పదా? ప్రజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ డిస్కషన్ ఇదే. ఒకవేళ పోటీ అనివార్యమైతే... ఇద్దరు మిత్రుల మధ్య పోటీలో థియేటర్లలో ఎవరిది పైచేయి అవుతుందో? చూడాలి.
అసలు వివరాల్లోకి వెళితే... తెలుగులో గోపీచంద్ హీరోగా 'శౌర్యం', 'శంఖం', రవితేజ హీరోగా 'దరువు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ శివ ఉన్నాడు కదా! తెలుగులో అతడికి హిట్స్ రాలేదు. కానీ, తమిళంలో అజిత్ హీరోగా తీసిన 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' విజయాలు సాధించాయి. ఇప్పుడు అతడి దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'అణ్ణాత్త'. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుకున్న విధంగా చిత్రీకరణ జరగకుండా కరోనా పడ్డుపడింది. లాక్‌డౌన్ వల్ల సినిమా పనులకు ఆటంకం ఏర్పడింది. దాంతో దీపావళికి కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ సినిమాపైనా కరోనా, లాక్‌డౌన్ ప్రభావం పడింది. దాంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అంతే!
తమిళనాడులో 'అణ్ణాత్త'కు పోటీ ఉండకపోవచ్చు. కానీ, తెలుగునాట అలా కాదు. అతడితో సమానంగా, ఇంకాస్త ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవికి క్రేజ్ ఉంటుంది. ప్రాంతీయ అభిమానం ఉంటుంది కాబట్టి. అందువల్ల, 'అణ్ణాత్త'కు 'ఆచార్య' బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇస్తుంది. రజనీకాంత్ కోసం చిరంజీవి సంక్రాంతి సీజన్ వదులుకునే అవకాశాలు లేవు. ఈ పోటీ ఎలా ఉఁటుందో వచ్చే ఏడాది చూడాలి.