చిరంజీవి సినిమాతో 'హహ్హా హాసిని' రీఎంట్రీ?
on May 20, 2020
మోహన్‌లాల్ నటించిన మలయాళ హిట్ 'లూసిఫర్'ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రన్ రాజా రన్', 'సాహో' సినిమాల ఫేమ్ సుజీత్ దర్శకుడు. ఆల్రెడీ అతడు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడట. ఇప్పుడు కాస్టింగ్ గురించి ఆలోచిస్తున్నాడట. సినిమాలో ఓ పాత్ర చేయమని జెనీలియాను సంప్రదించాలని అనుకుంటున్నారట. అది ముఖ్యమంత్రి కుమార్తె లేదా మీడియా హౌస్ అధినేత పాత్రల్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుందని ఫిలింనగర్ టాక్.
హహ్హా హాసిని అంటే తెలుగు ప్రేక్షకులకు జెనీలియా గుర్తొస్తుంది. అదంతా 'బొమ్మరిల్లు' సినిమా ప్రభావమే. ఆ సినిమాకి ముందు, ఆ సినిమా తర్వాత తెలుగులో జెనీలియా చాలా సినిమాలు చేశారు. అన్నిటిలోకెల్లా బెస్ట్ సినిమా 'బొమ్మరిల్లు'. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని తర్వాత జెనీలియా సినిమాలు దూరమయ్యారు. పెళ్లి తర్వాత పిల్లల ఆలనాపాలనాలో పడి, ఇన్నాళ్లూ రీఎంట్రీ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ సినిమాలు చేయాలనుకున్నారట. ఇప్పటి యంగ్ స్టార్ హీరోలు అందరి సరసన ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన జెనీలియా, వాళ్ల సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తారంటారా? వెయిట్ అండ్ సి.