ఇప్పుడు ఇండస్ట్రీ కళ్లన్నీ చిరంజీవి ఇంటి వైపే!
on May 21, 2020
ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కళ్లన్నీ మెగాస్టార్ చిరంజీవి ఇంటి వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా ఛోటా మోటా సినిమా నిర్మాతలు, నటీనటుల్లో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉంది. ఈ రోజు అనగనగా గురువారం ఉదయం పదిన్నర, పదకొండు గంటల ప్రాంతంలో మెగాస్టార్ ఇంటిలో ఇండస్ట్రీలో యాక్టివ్ గా సినిమాలు తీస్తున్న బడా నిర్మాతలు, పెద్ద సినిమాల దర్శకులు సమావేశం కానున్నారు. కొందరు హీరోలు కూడా హాజరు కానున్నట్టు సమాచారం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సైతం ఈ సమావేశానికి హాజరు అవుతారని వినికిడి.
సుమారు యాభై మంది ఇండస్ట్రీ భవిష్యత్ మీద చర్చించడానికి సిద్ధమయ్యారు. అందువల్ల, ఇండస్ట్రీ కళ్లన్నీ మెగాస్టార్ ఇంటి వైపే చూస్తున్నాయి. కరోనా కాటుకు ఇండస్ట్రీ కుదేలైంది. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్ వల్ల అన్ని పరిశ్రమల కంటే ఎక్కువగా నష్టపోయింది చిత్ర పరిశ్రమే. ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధలను సడలించి, ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించారు. సినిమా హాళ్లు తెరచుకోవడానికి, షూటింగులు చేసుకోవడానికి అనుమతులు లభించలేదు. ఒకవేళ ప్రభుతాన్ని అనుమతులు కోరాలని నిర్ణయిస్తే, ఏ విధమైన అనుమతి కోరాలి? షూటింగులు చేసే ప్రదేశాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుపడుతుంది? వంటివి సమావేశంలో చర్చించే అవకాశం ఉందట. పెద్దలు తీసుకొనే నిర్ణయం మీద చిన్న సినిమాల భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది. అందుకని, వాళ్లూ ఈ సమావేశంపై అమితాసక్తి చూపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
