Home

»

Latest News

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ గురించి విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Apr 20, 2026

టాలీవుడ్ లో తనదైన మార్కు డైలాగులు, పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్లతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మాస్ ఇమేజ్‌ను అందించిన పూరీ, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు. 

పూరీ సార్.. మీతో పని చేయడం గౌరవంగా ఉంది!
విజయ్ సేతుపతి 'ఎక్స్' (ట్విట్టర్)లో పూరీ జగన్నాథ్ తో కలిసి సెట్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగ సందేశాన్ని రాశారు. "ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఇది ధైర్యం, నమ్మకం, నిర్భయమైన గొంతుకతో నిర్మించుకున్న ఒక గొప్ప లెగసీ. డియర్ పూరీ సార్, మీతో కలిసి 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' చిత్రంలో పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.

నటుల మీద నమ్మకం ఉంచి, వారిని కంఫర్ట్ జోన్ దాటి మరింత మెరుగ్గా నటించేలా ప్రోత్సహించే దర్శకుల కోసం తాము ఎదురుచూస్తుంటామని, పూరీ సార్ ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారని విజయ్ సేతుపతి కొనియాడారు. ఈ సినిమా తమందరికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సరికొత్త కాంబినేషన్: స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' (Slumdog: 33 Temple Road) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, జె.బి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ సెట్ నుండి విజయ్ సేతుపతి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. 

పూరీ జగన్నాథ్ తన 26 ఏళ్ళ కెరీర్‌లో ఎంతో మంది నటులను సరికొత్తగా చూపించారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి లాంటి వర్సటైల్ యాక్టర్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com